సిటీ బ్యూరో, అక్టోబర్ 14, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. గురువారం వందల ఏండ్ల నాటి చరిత్ర కలిగిన ఇబ్రహీంపట్నం చెరువు ఆధునీకరణ, టూరి జం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌ను కోరారు. నిండుకుండను తలపిస్తున్న చెరువు ఫొటోలను ట్వీట్ చేస్తూ టూరిజం శాఖ దృష్టి పెడితే అద్భుతమైన వీకెండ్ టూరిజానికి కేంద్రంగా మారుతుందని, రిసార్టుతోపాటు బోటింగ్, కయాకింగ్, పారాసెయిలింగ్ ఈవెంట్లకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ లేక్ బ్యూటిఫికేషన్‌కు చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉన్న లోయపల్లి జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఓఆర్ఆర్ మీదుగా నాగార్జున సాగర్ వెళ్లే మార్గంలో ఆదిబట్ల సమీపంలో ఉన్న లోయపల్లి జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అనువైన ప్రదేశమని, చుట్టూ పరుచుకున్న గ్రీనరీ, కొండ ప్రాంతాలు ఎంతగానో అలరిస్తున్నాయని నెటిజన్లు తెలిపారు. పాల నురుగలతో పొంగిపొర్లుతున్న లోయపల్లి జలపాతం చూడటానికి పర్యాటకులు వీకెండ్లో వస్తుంటారని వివరించారు. కాగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధితోపాటు, పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.