ఉప్పల్, అక్టోబర్ 14: గొడ్డలి, కత్తులతో దాడిచేసిన దుండగులు తండ్రీకొడుకులను హత్య చేశారు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారు జామున ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమసాయినగర్‌లో ఉంటున్న నరసింహ శర్మ (78) ఇంటికి శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించి నరసింహ శర్మపై కత్తులు, గొడ్డలితో దాడిచేశారు. ఆ భవనం అంతస్తులో ఉన్న అతడి కుమారుడు శ్రీనివాస్ (35) కిందకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ సంఘటనలో తండ్రి, కొడుకు ఇద్దరూ మరణించారు. పనిమనిషిని దుండగులు బెదిరించడంతో అక్కడి నుంచి ఆమె భయంతో వెళ్లిపోయింది. ఆ తర్వాత దాడికి పాల్పడిన దుండగులు పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. హంతకుల వేలిముద్రలు సేకరించి, పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సంఘటన స్థలాన్ని మల్కాజిగిరి ఏసీపీ నరేశ్‌రెడ్డి, పోలీస్ అధికారులు సందర్శించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
నరసింహ శర్మ కుమారుడు శ్రీనివాస్ ఇటీవలే మలేషియా నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. ఈ హత్యలకు ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్లు భావిస్తున్నారు. హత్యకు గురైన నరసింహ శర్మ, కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా ఆస్తి తగదాలు ఉన్నాయని, రెండేండ్ల కిందట పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వివాదం వల్లే తండ్రి, కొడుకులు హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తండ్రీ కొడుకులను హత్య చేసిన దుండగులు పక్కాగా రెక్కీ నిర్వహించి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల ఇంటి సమీపంలో ఉండే హాస్టల్లో హంతకులు నాలుగైదు రోజులు బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందినా, భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్ బాగాయత్లో ప్లాటు, ప్రస్తుతం ఉంటున్న ఇంటికి సంబంధించిన వివాదాల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉంటుందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హంతకులు కిరాయి గుండాలై ఉండే అవకాశం ఉందని, ఇది సుఫారీ హత్యగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నిందితుల వచ్చి పోయిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. నిందితులకు సంబంధించిన ఆధారాలు లభించడంతో ఈ కేసు మిస్టరీ ఒకటి రెండు రోజుల్లోనే వీడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.