గోల్నాక/కాచిగూడ, అక్టోబర్ 14 : ఆసరా పింఛన్ల పంపిణీలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట ఏకే ప్లాజా పంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబర్పేట తహసీల్దార్ సీహెచ్.లలితతో కలిసి అంబర్పేట డివిజన్లోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 220 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ఆసరా కార్డులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందజేస్తూ పెద్ద కొడుకుగా మారిన సీఎం కేసీఆర్ సారును నిండు మనసుతో దీవించాలని ఆయన కోరారు. అంబర్పేట నియోజకవర్గంలో దాదాపు 7 వేల మంది లబ్ధిదారులకు కొత్తగా అవకాశం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. గోల్నాక డివిజన్ తులసీరాంనగర్ (లంక)లో పలు శాఖల అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు బస్తీవాసులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాచిగూడ: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడలోని దశరథ్ లైన్లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీ ప్రజలు డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి జలమండలి అధికారులను పిలిపించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, ప్రేరణ, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, ప్రధాన కార్యదర్శి కె.సదానంద్, బాబు, లక్ష్మీనారాయణ, బి.కృష్టాగౌడ్, బబ్లూ,ఆంటోని పాల్గొన్నారు.