హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీలు భౌగోళిక శాస్త్ర అధ్యయనంలో సరికొత్త ఫలితాలను మన ముందు ఉంచుతున్నాయి. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్), ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జియో స్పేషియల్ ఏఐ, డ్రోన్, ఎనలిటిక్స్… ఇలా వివిధ సాంకేతిక పరిజ్ఞానాలు భూమిని అణువణువు స్కాన్ చేసి అవసరమైన డాటాను అందిస్తున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ గరుడలైటిక్స్ భౌగోళిక శాస్త్ర అధ్యయనంలో సరికొత్త విధానాలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలింజెన్స్, డాటా ఎనలిటిక్స్ వంటి పరిజ్ఞానం ఎంతో కీలకంగా మారింది. ఆ పరిజ్ఞానం సాయంతో గరుడలైటిక్స్ సార్టప్ పలు సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నది. ఉదాహరణకు రోడ్లపై ఉన్న గుంతలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నది. జీపీఎస్ వినియోగించి అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా జంతువులు, వేటగాళ్ల సంచారాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.
గరుడలైటిక్స్కు టీ హబ్‌లో ప్రోత్సాహం…
జీఐఎస్‌ను విభిన్న రంగాల్లో విసృత్తంగా వాడేందుకు అవకాశం ఉన్నదని, ఆ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలను టీహబ్ గుర్తించి తమ కోహర్ట్ కార్యక్రమానికి ఎంపిక చేసిందని స్టార్టప్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ వీఎస్ఎస్ కిరణ్, సీటీఓ జయంత పొద్దార్ తెలిపారు. టెక్నాలజీతో పరిచయం లేకపోయినా సామాన్యులు సైతం జీఐఎస్‌ను వినియోగించేలా తమ స్టార్టప్ అప్లికేషన్లను రూపొందిస్తున్నదని చెప్పారు. వ్యవసాయం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, నిత్యావసరాలు, సహజ వనరుల నిర్వహణ ఎమర్జెన్సీ మెనేజ్మెంట్ ఇలా వివిధ రంగాలకు అవసరమైన అప్లికేషన్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్‌లో తమ స్టార్టప్‌కు చోటు దక్కిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కేవలం నాలుగు స్టార్టప్‌లు ఈ సదస్సులో ప్రదర్శించగా, అందులో గరుడలైటిక్స్ ఒకటని చెప్పారు. జియోస్పేషియల్లో తాము రూపొందిస్తున్న అప్లికేషన్లను వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. హెచ్ఎండీఏ, ఎన్యూఐఎంలు చేపట్టే గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న చెరువులకు సంబంధించిన పరిధిని, ప్రవాహ ప్రాంతాలను గుర్తించే ప్రాజెక్టును ఇచ్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు. వీటితో పాటు పలు ప్రాజెక్టులను చేపట్టడంపై చర్చలు జరుగుతున్నాయని కిరణ్ తెలిపారు. సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభు త్వం, టీ హబ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయని, స్టార్టప్‌లతో నేరుగా ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.