సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ స్టీఫెన్ రవీంద్ర క్యాష్ రివార్డుతో అభినందించారు. గురువారం కమిషనరేట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంషాబాద్ ఎస్వోటీ, సీసీఎస్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను చేధించినందుకు గానూ శంషాబాద్ ఏడీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ నర్సింహ, ఎస్ఐ రవి, మాధవరెడ్డితో పాటు 19 మంది కానిస్టేబుళ్లు, మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మయూర్‌నగర్‌లో జరిగిన స్నాచింగ్ కేసును చేధించినందుకు గాను మియాపూర్ సీఐ తిరుపతిరావు, డీఐ కాంతారెడ్డి, డీఎస్ఐ జగదీశ్వర్‌తో పాటు ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో జరిగిన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ చోరీకేసును చేధించిన మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఏఎస్ఐ రాంచందర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నగదు రివార్డులు అందచేసి, అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రైం డీసీపీ కల్మేశ్వర్, బాలానగర్ డీసీపీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.