సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): చైనా సైబర్ చీటర్స్‌కు సంబంధించిన రూ. 903 కోట్ల హవాల దందాపై కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. సైబర్‌నేరాలు చేస్తూ బాధితులను మోసం చేసి సేకరిస్తున్న నగదును, హవాల ద్వారా చైనీయులు దేశం దాటిస్తున్నారనే విషయాన్ని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఈ ఘటన వివరాలను మీడియాకు వివరించి, జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఈడీ, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో), తదితర విచారణ ఏజెన్సీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
గురువారం ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను సంప్రదించారు. పెట్టుబడుల పేరుతో అమాయకులను ఎలా మోసం చేస్తున్నారు.. అమాయకుల నుంచి సేకరించిన డబ్బు ఎలా డిపాజిట్ చేయిస్తున్నారు.. అవి ఏ మార్గంలో వచ్చి ఫారిన్ మనీ ఎక్సేంజ్ ఖాతాల్లో జమ అవుతున్నాయి.. డాలర్లుగా మారి హవాలా ద్వారా ఎలా బయటకు వెళ్తున్నాయి.. అన్న విషయాలను కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ గంగాధర్‌ను అడిగి తెలుసుకున్నారు. నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టును కూడా సైబర్‌క్రైమ్ పోలీసుల నుంచి వారు తీసుకున్నారు.
రూ. 400 కోట్లు ఒక్కడే..
ఒక ఖాతాలో 7 నెలలు.. మరో ఖాతాలో 38 రోజుల్లో రూ. 903 కోట్లు డిపాజిట్ అయ్యాయి. వాటిని ఫారిన్ ఎక్సేంజ్ ద్వారా ఇండియన్ కరెన్సీని డాలర్లుగా మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. ఈ హవాలా దందా కేసులో చైనాకు చెందిన లెక్ అలియాస్ లి ఝూవాంజు, తైవాన్‌కు చెందిన చు చున్ హుతో పాటు షాహిల్ బజాజ్, సన్నీ అలియాస్ పంకజ్, వీరేందర్ సింగ్, సంజయ్‌కుమార్ యాదవ్, నవీనీత్ కౌశిక్, మహ్మద్ పర్వీజ్, సయ్యద్ సుల్తాన్, మర్జా నదీమ్ బేగ్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో షాహిల్ , సన్నీ మనీ ఎక్సేంజ్‌ల నుంచి డాలర్లు తీసుకొని, వాటిని హవాలా ద్వారా తరలించడంలో కీలక భూమిక పోషించారు. అరెస్టయిన వారిలో ఎవరి పాత్ర ఏంటీ.. అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. అరెస్టయిన వారిలో ఒకరు మినహా మిగతా వారికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే, దర్యాప్తు పోలీసుల వినతి మేరకు.. న్యాయస్థానం ఏడుగురు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది.
లింకు పంపి.. వల వేసి
అమీర్‌పేటకు చెందిన అనూష అనే యువతి ఫోన్ నంబర్‌ను వెల్త్ఇన్వెస్ట్ అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. మేం ఇలా పెట్టుబడి పెట్టాం.. ఇంత లాభం వచ్చింది.. మాకు మంచి రోజులొచ్చాయి..అంటూ ఆ గ్రూప్‌లో చర్చించుకోవడం చూసి అనూష ఆకర్షితురాలైంది. తాను ముందుగా రూ.500 డెమో ఇన్వెస్ట్‌మెంట్‌తో ముందుకొచ్చింది. దీంతో ఆమె ఫోన్ నంబర్‌ను టెలిగ్రాప్లోని మరో గ్రూప్‌లో యాడ్ చేశారు. అక్కడి నుంచి ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయించి రూ. 500తో క్రిప్టో కొనిపించారు. క్రిప్టో చిరునామాను తీసుకున్న సైబర్‌నేరగాళ్లు దానిని ట్రేడింగ్ చేస్తున్నామని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. (దానిని సైబర్ నేరగాళ్లు అమ్మి, వచ్చిన డబ్బును తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకుంటారు). మరుసటి రోజు మీకు రూ. 1000 లాభం వచ్చిందంటూ అనూష ఖాతాకు పంపించారు. నమ్మకం కుదిరిన అనూష ఆ తరువాత లక్ష రూపాయల క్రిప్టో కొని, సైబర్‌నేరగాళ్లకు అందించింది. ట్రేడింగ్ చేస్తున్నామంటూ, లాభాలొచ్చాయంటూ యాప్‌లో స్క్రీన్‌పై అంకెల్లో లాభాలు చూపించారు. అయితే వాటిని డ్రా చేసుకునేందు మరింత పెట్టుడి పెట్టాలంటూ తిరకాసు పెట్టారు. అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది.
ఎక్కువ మొత్తాలు విత్‌డ్రా చేసుకోలేరు
ఇన్వెస్ట్మెంట్ యాప్‌లను తయారు చేసి లింకులు పంపించి వల వేసే పనులు చైనా యాప్‌లే చేస్తుంటాయి. చాలా వరకు లింక్‌ల ద్వారానే వాటిని బాధితులకు అందిస్తున్నారు. యాప్‌లలో పెట్టుబడి, వచ్చిన లాభం(అంకెల్లో) కనిపిస్తూ ఉంటుంది. తక్కువ మొత్తాలకు సంబంధించిన లాభాలు వచ్చినప్పుడు వాటిని డ్రా చేసే వెసులుబాటు ఇచ్చి.. ఆ తరువాత దానిని బ్యాంక్ ఎండ్‌లో లాక్ చేస్తారు.. స్క్రీన్‌పై లాభం వచ్చిందని చెప్పే అంకెలు మాత్రమే కనిపిస్తుంటాయి. అలా పెట్టుబడి పెట్టిస్తూ.. మీకు భారీ లాభాలొస్తున్నాయంటూ స్క్రీన్‌పై చూపిస్తూ వెళ్తారు.. ఒకరు రూ. 50 వేలు.. మరొకరు లక్ష… ఇంకొకరు రూ. 3 లక్షలు.. ఇలా లక్షల పెట్టుబడి పెడుతూ వెళ్లి చివరకు మోసమని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా ప్రతి రోజు దేశ వ్యాప్తంగా వందలాది మంది మోసపోతుండగా, కోట్లాది రూపాయలు ఆయా ఖాతాల్లో డిపాజిట్ అవుతున్నాయి.