సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): బీమా క్లెయిమ్‌లో నిర్లక్ష్యం వహించినందుకు బాధితుడికి బీమా మొత్తం రూ.15 లక్షలతో పాటు జరిమానాగా రూ.లక్ష, కోర్టు ఖర్చుల కింద మరో రూ.20వేలు చెల్లించాలని వెంకటేశ మోటార్స్- లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ విచారించింది. 45 రోజుల్లో వ్యతిరేకపార్టీలు బెంచ్ ఆదేశాలు పాటించాలని, 12 శాతం వడ్డీతో కలిపి ఫిర్యాదుదారుడికి అందజేయాలని ఆదేశించింది.
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన గోపరాజు కుమార్ కుమారుడు యమహా ఆర్15 బీఎస్ 6 మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2020 నవంబర్‌లో రూ. లక్షా 51వేల 400లకు కొనుగోలు చేశాడు. దీంతోపాటే రూ.9885ల ప్రీమియం చెల్లించి వ్యక్తిగత ప్రమాదబీమా పాలసీని కూడా తీసుకున్నాడు. కాగా, మోటార్ సైకిల్ ప్రమాదంలో గోపరాజు కుమారుడు మరణించాడు. దీంతో వ్యక్తిగత ప్రమాదబీమా ప్రకారం రావాల్సిన బీమా డబ్బులు చెల్లించాలని కోరుతూ వెంకటేశ మోటార్స్- లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆశ్రయించాడు. వాయిదాలు వేస్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించాయి.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కుదరదని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాదించింది. దీంతో ఫిర్యాదుదారుడు గోపరాజు 2021, మే నెలలో లీగల్ నోటీసులు పంపించాడు. న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కేసు దస్ర్తాలను పరిశీలించిన కమిషన్-1 బెంచ్.. ఇన్సూరెన్స్ కంపెనీ, డీలర్ చేసిన వాదనల్లో ఎలాంటి సహేతుకమైన అంశాలు లేవని, నిబంధనల ప్రకారం ఫిర్యాదుదారుడికి రూ.15 లక్షల బీమాతో పాటు రూ.లక్ష నష్టపరిహారంగా, కోర్టు ఖర్చుల కింద మరో రూ.20వేలు చెల్లించాలని వెంకటేశ మోటార్స్-లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది.