సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కారు డ్రైవర్‌ను బాధితురాలు షీ టీమ్స్‌కు పట్టించింది. ఈ నిందితుడిని కోర్టులో హాజరు పరచడంతో.. న్యాయస్థానం అతడికి 8 రోజుల జైలు శిక్ష విధించిందని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద బాధితురాలు నడుచుకుంటూ వెళ్తుంది. నిందితుడు మహ్మద్ హైదర్ అలీఖాన్ కారు నడిపిస్తూ బాధితురాలి వద్దకు రాగానే స్లో చేశాడు. ఏదైనా చిరునామా అడిగేందుకు ప్రయత్నిస్తున్నాడని భావించిన బాధితురాలు కారు సమీపంలోకి వెళ్లింది. దీంతో కారు డ్రైవర్ ఆమె శరీరాన్ని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు తన సెల్ఫోన్లో కారు నంబర్‌ను ఫొటో తీసి, హైదరాబాద్ షీ టీమ్స్‌కు మెయిల్ చేసింది. షీ టీమ్స్ రంగంలోకి దిగి ఘటన జరిగిన చోట సీసీ టీవీ పుటేజీలను సేకరించి, నిందితుడు మహ్మద్ హైదర్ అలీఖాన్‌ను అరెస్ట్ చేసింది. నిందితుడిని కోర్టులో హాజరు పరుచగా న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని అదనపు సీపీ వివరించారు.
ఆశ్రయమిచ్చి.. బ్లాక్ మెయిల్ చేస్తూ..
అబ్దుల్ సలాం అనే విద్యార్థి ఒక యువ జంటకు ఆశ్రయం ఇచ్చాడు. యువ జంట రహస్యంగా ఉన్న సమయంలో రహస్య కెమెరాతో వీడియోలు తీశాడు. యువతికి ఆ వీడియోలు పంపించి, తన కోరిక తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీనిపై బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించగా, నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద ఉన్న వీడియోలు డిలీట్ చేసింది. నిందితుడిని కోర్టులో హాజరు పరుచగా 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.