సికింద్రాబాద్, అక్టోబర్ 12: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీ, రాజస్థాన్‌కు తరలిస్తున్న నలుగురిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.76లక్షల విలువైన గంజాయితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్సయ్య, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.శ్రీను, రవిబాబు, నర్సింహ వివరించారు. ఢిల్లీకి చెందిన విక్కీ కొంతకాలంగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విశాఖపట్నంలో కొనుగోలు చేస్తూ రైళ్లు, రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నాడు. తిరుమలగిరిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇక్కడ నిల్వ చేస్తున్నాడు. అంతేకాక వ్యాపార నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ వాసి సమున్ అహ్మద్(32)కు జీతంతో పాటు భాగస్వామ్యం ఇస్తానని చెప్పాడు.
సరఫరా కోసం సౌత్ వెస్ట్ ఢిల్లీ, శ్యామ్ విహార్ ప్రాంతానికి చెందిన సంజీవ్‌కుమార్(40), గౌరవ్‌కుమార్(38), కక్రోలా సౌత్ వెస్ట్‌లో కూరగాయల వ్యాపారం చేసే కర్తార్ సింగ్ (31)ను నియమించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సమున్ అహ్మద్ కారులో సంజీవ్‌కుమార్, గౌరవ్ కుమార్, కర్తార్ సింగ్‌తో పాటు 114 కేజీల గంజాయిని సికింద్రాబాద్ స్టేషన్లో వదిలి వెళ్లిపోయాడు. వీరంతా గంజాయితో సికింద్రాబాద్ స్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంపై వేచి చూస్తుండగా రైల్వే అదనపు డీజీపీ సందీప్ శాండిల్య, రైల్వే ఎస్పీ అనురాధ ఆదేశాలతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు శ్రీను, రవికుమార్, ఎస్సై రమేశ్, మజీద్లు వారిని తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారంతో తిరుమలగిరికి వెళ్లి అక్కడ ఉన్న అద్దె ఇంట్లో భద్రపరిచిన 205 కేజీల గంజాయితో పాటు అక్కడ ఉన్న సమున్ అహ్మద్, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విక్కీ కోసం గాలిస్తున్నారు.