మునుగోడు, అక్టోబర్ 10 : ‘ఒక పార్టీ కుట్ర, ద్రోహుల రాజకీయ స్వార్థం కోసమే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలకు అండగా ఉంటున్న ఓ దొంగను రూ.18వేల కోట్లకు కొనుగోలు చేశారు. ఆ డబ్బును మునుగోడు అభివృద్ధికి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అందుకు బీజేపీ సిద్ధమా..? అని ప్రధాని మోదీ, అమిత్ షాకు సవాల్ చేశారు. వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం, సీపీఐ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, వామపక్ష నాయకులు హాజరయ్యారు. ప్రజలు డప్పు చప్పుళ్లు, బోనాలతో వచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికలు బీజేపీ స్వార్థం వల్లే వచ్చాయన్నారు. రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకే అమ్ముడుపోయానని మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడని తెలిపారు. గత పాలకుల హయాంలో నల్లగొండ జిల్లా ఎడారిగా ఉండేదని, స్వరాష్ట్రంలో సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. కేసీఆర్ లేకుంటే నియోజకవర్గంలో నీళ్లు లేక కుటుంబాలు వలసలు పోయే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఇక్కడి ఫ్లోరోసిస్ సమస్య గురించి గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుంచి వివరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మిషన్ భగీరథ అమలై ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచినీటి కోసం 18 రూపాయలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. రాజగోపాల్‌రెడ్డికి 18 వేల కోట్లు ఇచ్చి కొన్నదని విమర్శించారు. ఆ డబ్బును మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఇస్తే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటామని చెప్పారు. మోదీ, అమిత్ షాకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి దమ్ముంటే సిద్ధం కావాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి కోట్లతో యదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తే.. హిందూ మతానికి అంబాసిడర్లమని చెప్పుకొనే మోదీ, అమిత్ షా వంద రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణలో అనేక మార్లు పర్యటించారు.. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి పైసా విదల్చలేదని అన్నారు. విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు దామరచర్ల వద్ద రూ.30వేల కోట్లతో పవర్ ప్లాంటును నిర్మిస్తున్నామని, దీనికి కేంద్రం పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. రూ.20వేల కోట్లతో చెరువుల పునరుద్ధరణ చేపట్టామని, ఇందులోనూ కేంద్ర ప్రభుత్వ సాయం సున్నా అని తెలిపారు. గుజరాత్లో వ్యవసాయానికి ఆరు గంటల కరంటే ఇస్తున్నారని, తెలంగాణలో ఇచ్చినట్లు నిరంతరంగా ఎందుకు ఇవ్వడం లేదని ఆ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర పన్నిందని మండిపడ్డారు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా మోదీ 14 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ 14 నెలల్లోనే చేసి చూపించారని చెప్పారు. వామపక్షాల మద్దతుతో మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేసి దేశ రాజకీయాలకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి మీ ముందుకు వచ్చిన కుసుకుంట్లను మరోసారి దీవించాలని విజ్ఞప్తి చేశారు.