సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద కొనసాగుతుంది. ఎగువన ఉన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో మూడు రోజుల కిందట భారీ వర్షాలు పడ్డాయి. శుక్రవారం మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి గండిపేట (ఉస్మాన్‌సాగర్)కు 450 క్యూసెక్కుల వరద వచ్చింది. ఇప్పటికే రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. దీంతో అధికారులు రెండు గేట్లను రెండు అడుగుల చొప్పున ఎత్తి దిగువకు 476 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే హిమాయత్‌సాగర్ వద్ద శుక్రవారం సాయంత్రం 1800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. అధికారులు ఇక్కడ మూడు గేట్లను రెండు అడుగుల చొప్పున ఎత్తి దిగువకు 2060 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు జలాశయాల నుంచి 2536 క్యూసెక్కుల జలాలు విడుదలవుతుండటంతో మూసీలో ప్రవాహం కనిపిస్తున్నది.
గ్రేటర్‌కు మూడు రోజులు వర్షసూచన
సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రుతుపవనాలు తీవ్రంగా ఉండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు బంజారాహిల్స్‌లో 4.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.