బంజారాహిల్స్,అక్టోబర్ 7: రుతుక్రమంపై మహిళల్లో సరైన అవగాహన లేకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రముఖ వైద్యురాలు పద్మశ్రీ మంజుల అనగాని అన్నారు. బహిష్టు సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్’ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న పీపుల్స్ ప్లాజాలో ప్యూరథాన్ 2022 పేరుతో వాకథాన్ నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీఫ్లెక్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సన్నాహక కార్యక్రమంలో ప్యూరథాన్ వివరాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో సందీప్ కిషన్, డా.మంజుల అనగాని, దర్శకుడు మెహర్ రమేశ్, యాంకర్ ఝాన్సీ తదితరులు మాట్లాడుతూ… మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నదని, దీనికోసం ‘పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్’ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి వాకథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వాకథాన్‌లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హీరోయిన్ కీర్తి సురేశ్, నటుడు సత్యదేవ్, ప్రముఖ గాయకుడు సిధ్ శ్రీరామ్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొననున్నట్లు నిర్వాహకురాలు శైలా తాళ్లూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యురాలు షర్మిల పెండ్యాల, పార్వతి సుదర్శన్, రచన తదితరులు పాల్గొన్నారు.