సికింద్రాబాద్, అక్టోబర్ 7: అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందించనుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తార్నాక డివిజన్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి నూతన పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేశారు. అదేవిధంగా సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఒక్కరోజే సుమారు 1350 మంది లబ్ధిదారులకు పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మగౌరవంతో బతికేందుకు భద్రతను కల్పిస్తుందన్నారు.
దేశ వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇస్తుంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని తెలిపారు. ఆయనకు అందరం అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. లబ్ధిదారులు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు రామేశ్వర్గౌడ్, కిశోర్గౌడ్తో పాటు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.