మియాపూర్, అక్టోబర్ 6 : దుర్గా మాత అనుగ్రహంతో నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని విప్ అరెకపూడి గాంధీ ఆకాంక్షించారు. భక్తితో పూజించి పరస్పరం ఇచ్చుకునే జమ్మితో ప్రతి ఇంటా సువర్ణ పూలు పూయాలని ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని వివేకానందనగర్ డివిజన్లో జమ్మి చెట్టు పూజ, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి డివిజన్లలో రావణ దహన కార్యక్రమాలలో కార్పొరేటర్ల రోజాదేవి, వెంకటేశ్, సత్యనారాయణలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికైనా చెడుపై మంచిదే విజయమని, ఇందుకు నిదర్శనమే దసరా వేడుకలన్నారు. దుర్గామాత అనుగ్రహం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిపైనా ఉండాలని విప్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు, కాలనీ సంఘాల ప్రతినిధులు, మహిళా నేతలు, ప్రజలు పాల్గొన్నారు. విప్ గాంధీ నివాసానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు విచ్చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మాదాపూర్, అక్టోబర్ 6: హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పేట్ గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినాయక ఉత్సవాల్లో భాగంగా లడ్డూను కైవసం చేసుకున్న కాంచన్ రోడ్వేస్ అధినేత మల్లమాడ సంజు స్వామి ఆయన తనయులతో కలిసి రామబాణాన్ని ఎక్కుపెట్టి రావణ దహనం చేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన బతుకమ్మ దాండియా కార్యక్రమాల్లో యువతి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి బతుకమ్మ, దాండియా ఆడుతు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల అనంతరాం గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, జీతయ్య, ప్రభు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, నరేందర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, దేవెందర్ ముదిరాజ్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీకి స్థానిక నాయకులతో కలిసి హఫీజ్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.