బంజారాహిల్స్,అక్టోబర్ 6: దేశంలో గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరిస్తున్న తరుణంలో ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు భారత్ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటు చారిత్రక అవసరమనే విషయాన్ని ప్రజలంతా గుర్తించారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. దసరా సందర్భంగా గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విజయయాత్ర త్వరలో ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలతో పేర్కొన్నారు. నిరంకుశవైఖరితో పాలన కొనసాగిస్తున్న బీజేపీని ఎదుర్కొనే శక్తి దేశంలో కేసీఆర్‌కు ఒక్కరికే ఉందన్నారు. దేశంలోని పరిస్థితులన్నింటినీ పరిశీలించిన తర్వాతనే సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తోనే దేశంలోని బడుగు బలహీన వర్గాలు, పేదలు తెలంగాణ మోడల్ తమ రాష్ర్టాల్లో కూడా అమలు కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, జూబ్లీహిల్స్ డివిజన్ నాయకులు నగేష్ సాగర్ ,అశోక్, ఒర్సు శ్రీనుతో పాటు వివిధ డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ నాయకులు సర్ఫరాజ్, నవీద్, మహేందర్‌సింగ్, ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.