మేడ్చల్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా భోగారంలో వంద ఎకరాల్లో లే అవుట్ ఏర్పాటుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. కీసర మండలం భోగారంలో వంద ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్ ఏర్పాటుకు రైతుల అంగీకారంతో అధికారులు ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. రైతులు ఇచ్చే భూముల వివరాలను జిల్లా రెవెన్యూ అధికారులు పరిశీలించారు. పట్టా భూములుగా నిర్ధారణ రావడంతో సర్వేను పూర్తి చేశారు.
సర్వేలో ప్రభుత్వ, అసైన్మెంట్, సీలింగ్ భూములు లేకపోవడంతో లే అవుట్ ఏర్పాటుకు సంబంధించిన పనులను హెచ్ఎండీఏ అధికారులు వేగవంతం చేశారు. 62 మంది పట్టాదారులు అంగీకరించడంతో 100 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు వెల్లడించారు. జాతీయ రహదారులతో పాటు ఘట్కేసర్ రైల్వేస్టేషన్ కూడా సమీపంలోనే ఉండటంతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో హెచ్ఎండీఏ లే అవుట్ ఏర్పాటుకు భోగారంను ఎంపిక చేశారు.