కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 30 : కూకట్పల్లి నియోజకవర్గంలో శరన్నవరాత్రోత్స వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కాలనీలు, బస్తీలలో దుర్గామాత మండపాలు, ఆయా దేవాలయాలలో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవ వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీషాబాబురావు, జూపల్లి సత్యనారాయణ లు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బాబురావు, శ్రవణ్‌కుమార్ ఉన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లోని శ్రీదుర్గా రామలింగేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజల్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని వాసవీ దేవాలయంలో అమ్మవారు శ్రీలలితాదేవి అలంకరణతో ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో కొత్త వినయ్‌కుమార్, రూపా దంపతులు రూ.5 లక్షల విలువైన వెండి ఊయల (తొట్లె), అమ్మవారి వెండి విగ్రమాన్ని దేవాలయానికి సమర్పించారు. ప్రత్యేక హోమ పూజలు, సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నసమారాధన చేశారు. ప్రత్యేక పూజల్లో ఎన్.గురుప్రసాద్, రత్నకుమారి దంపతులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని శ్రీకనకదుర్గా దేవాలయంలో శరన్నవరాత్రోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నేడు మహాలక్ష్మీ దేవిగా అలంకరించి పూజలు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేడుకల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన, చంఢీహోమం పూజలు నిర్వహించారు.
బాలానగర్, సెప్టెంబర్ 30 : బాలానగర్ పారిశ్రామికవాడలో దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు ఐదోరోజు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ వల్లబ్నగర్లోని కాళికామాతా ఆలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఫతేనగర్ డివిజన్ పరిధి నేతాజీకాలనీలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జవహార్నగర్కాలనీలోని కనకదుర్గాదేవి, శీతాలాదేవి, కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఐదోరోజు అమ్మవారు అష్టలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.