అంబర్‌పేట, సెప్టెంబర్ 29: అంబర్‌పేట అలీకేఫ్ నుంచి మలక్‌పేటకు వెళ్లే దారిలో ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జిపై కొత్తగా నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసే విషయమై అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చర్చించారు. మూసారాంబాగ్పై సరైన వంతెన లేకపోవడంతో ప్రతి వానాకాలంలో ముంపునకు గురవుతుంది. దీంతో అంబర్‌పేట, మలక్‌పేటకు మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతస్థాయి అధికారులు సందర్శించి ఈ కాజ్‌వేపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని, అందుకు రూ.52 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు తయారు చేశారు. నిధులు కూడా మంజూరయ్యాయి. శంకుస్థాపన విషయమై ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అక్టోబర్ 15వ తేదీలోపు శంకుస్థాపనకు సమయం ఇస్తానని మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు.