హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్లో నిర్మించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చాలా అద్భుతంగా ఉన్నదని, పౌరుల రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న కార్యక్రమాలు బాగున్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ఓవెన్ ప్రశంసించారు. లక్డీకపూల్లో హోంమంత్రి మహమూద్ అలీతో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న సంస్కరణలు, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు, మహిళా భద్రత కోసం అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక విభాగం ఏర్పాటు, జైళ్లశాఖలో సంస్కరణలు వంటి అంశాల గురించి వివరించారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, మహిళా భద్రతా విభాగం ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా, హైదరాబాద్ అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.