మన్సూరాబాద్, సెప్టెంబర్ 15: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న కేసులో ఓ వ్యక్తిని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుతో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి రూ. 1.35 కోట్ల విలువైన 550 కేజీల గంజాయి, డీసీఎం, 2 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన వెంకటేశ్ (36) డీసీఎం డ్రైవర్. ఏడాది కిందట వెంకటేశ్‌కు తమిళనాడుకు చెందిన విజయప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది.
విజయప్రసాద్ తనకు తెలిసిన కిమ్ముడు నర్సింగ్‌రావు, షేక్ మహ్మద్‌తో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. ఏపీ, విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసి, అక్కడి నుంచి మహారాష్ట్ర, ముంబైకి తరలిస్తున్నారు. వెంకటేశ్ డీసీఎంలో సరుకు తీసుకొని ఏపీలోని తుని, నర్సీపట్నం వెళ్లిన సమయంలో విజయప్రసాద్ మరోసారి కలిశాడు. గంజాయి అక్రమ రవాణాపై వెంకటేశ్‌కు వివరించాడు. విజయప్రసాద్ చెప్పిన విధంగా తన డీసీఎంలో గంజాయి రవాణా చేసేందుకు వెంకటేశ్ అంగీకరించాడు. ఏపీ నుంచి ముంబైకి గంజాయి రవాణా చేసినందుకు వెంకటేశ్‌కు రూ. 1.50 లక్షలు ఇచ్చేందుకు విజయప్రసాద్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత వెంకటేశ్ గంజాయిని మూడు సార్లు ముంబైకి తరలించాడు. గంజాయి కోసం ఈనెల 12న వెంకటేశ్ డీసీఎంను తీసుకొని ఏపీలోని ఏలూరు, నిడదవోలుకు వెళ్లాడు.
అక్కడ విజయప్రసాద్‌ను కలుసుకున్నాడు. రెండు రోజుల తర్వాత షేక్ మహ్మద్ సహకారంతో 13 బండిల్స్ గంజాయి (550 కేజీలు) తీసుకుని ముంబైకి బయలుదేరాడు. వెంకటేశ్ తన డీసీఎంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు హయత్‌నగర్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో గురువారం తెల్లవారు జామున పెద్ద అంబర్పేట్ సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో డీసీఎంను తీసుకుని వచ్చిన వెంకటేశ్ కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. డీసీఎంను తనిఖీ చేయగా 550 కేజీల గంజాయి బయటపడింది. నిందితుడైన వెంకటేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న కిమ్ముడు నర్సింగ్‌రావు, షేక్ మహ్మద్, విజయప్రసాద్ పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ కె. పురుషోత్తం రెడ్డి, హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్ పాల్గొన్నారు.