బడంగ్‌పేట, సెప్టెంబర్12: మహేశ్వరం నియోజక వర్గం పరిధిలో‘ మన ఊరు మన బడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించవద్దని స్పష్టం చేశారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిర్లాహిల్స్లోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లెలగూడలోని చల్లా లింగా రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. ‘మన ఊరు మన బడి’ కింద మంజూరైన నిధుల వివరాలు, ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి ఎంఈవో కృష్ణయ్య, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. అన్ని తరగతి గదులను పరిశీలించారు. ప్రతి పాఠశాలలో వాచ్మెన్ కోసం గదిని ఏర్పాటు చేయించాలని కమిషనర్ నాగేశ్వర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో కృష్ణయ్య, ప్రిన్సిపాల్ సైదులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.