తొమ్మిదిరోజుల పాటు అత్యంత వైభవంగా పూజలందుకున్న విఘ్నేశ్వరుడు శుక్రవారం శోభాయాత్రతో వీడ్కోలు తీసుకోనున్నాడు. ఈ మేరకు ప్రభుత్వం నిమజ్జన వేడుకకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 20 కిలోమీటర్ల పొడవునా సాగే ఆధ్యాత్మిక యాత్రకు లోటు రానీయకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్సవం సజావుగా, ప్రశాంతంగా పూర్తయ్యేలా 35వేల మందికి పైగా పోలీసులు, ఇతర విభాగాలకు చెందిన 10,470 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. తెల్లవారుజామున నాలుగింటి వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. శనివారం వరకు అధికారులందరూ అప్రమత్తతతో వ్యవహరించాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. శోభాయాత్ర దారుల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉత్సవం ప్రశాంతంగా ముగిసేలా ప్రజలందరూ సహకరించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర విన్నవించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : నవరాత్రులు అంగరంగ వైభవంగా, విశేష పూజలందుకున్న గణనాథులు తల్లి ఒడికి చేరేందుకు సిద్ధమయ్యారు. భక్తజనులకు విఘ్నాలు తొలగించేలా అభయమిస్తూ పయనమవుతున్నాడు. గణేశ్ శోభాయాత్రకు ప్రభుత్వ యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. విగ్రహాల ఊరేగింపు నుంచి నిమజ్జనం వరకు భక్తులకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తున్నది. చిన్న అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఊరేగింపులో సందడి చేయనున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే హైదరాబాద్ గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభయాత్రను కనులారా వీక్షించనున్నారు. మొత్తం 10,470 మంది సిబ్బంది నిమజ్జన ప్రక్రియలో నిమగ్నం కానున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 కిలోమీటర్ల మేర డబుల్ లేయర్ భారీగేటతోపాటు నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూం, వాచ్టవర్లను ఏర్పాటు చేశారు.
వినాయక నవరాత్రి నిమజ్జనంలో భాగంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేస్తున్నారు. ఆరు జోన్ల పరిధిలోని ప్రతి సరిల్లో నిమజ్జన కొలనులు, బేబీ పాండ్స్ వద్ద దాదాపు 1667 మంది సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు.
కవాడిగూడ, సెప్టెంబర్ 8: నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు అన్నారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని.. వినాయక ఉత్సవాలను వైభవంగా జరపడమే తమ లక్ష్యమన్నారు. నిమజ్జన శోభాయాత్రకు అసోం సీఎం హాజరవుతారని..బాలాపూర్ లడ్డూ వేలం తరువాత శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టు యజమానులు వెంకటరత్నం, సుధీర్‌లు మహా వినాయకుడి శోభాయాత్రకు ఉచితంగానే ట్రాలీ వాహనాన్ని సమకూరుస్తున్నారు.
ప్రతి ఏడాది మాదిరి ఖైరతాబాద్ గణేశుడిని ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేస్తారు. మోడ్రన్ కంపెనీకి చెందిన ఈ క్రేన్ వంద టన్నుల బరువును సునాయసంగా ఎత్తుతుంది.
గురువారం రాత్రి 9.30 గంటల నుంచి 10 గంటల మధ్య పంచముఖ మహాగణపతికి ఉద్వాసన పూజ నిర్వహిస్తారు. కలశాన్ని కదిలించి నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 11 నుంచి 12 గంటల మధ్య ఉపమండపాల్లో ప్రతిష్ఠించిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ త్రిశక్తి మహాగాయత్రి అమ్మవార్ల విగ్రహాలను ట్రాలీపై పెడుతారు. అర్ధరాత్రి 1 గంటకు పంచముఖ మహాలక్ష్మి గణపతిని ట్రాలీపై ఉంచి వెల్డింగ్ పనులు ప్రారంభిస్తారు.
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెన్షెన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న క్రేన్ నం.4 వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు చేరుకుంటుంది. తుది పూజల అనంతరం మధ్యాహ్నం 3లోపు నిమజ్జనం పూర్తి చేస్తారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నిమజ్జనం సందర్భంగా విద్యుత్ సరఫరా తీరును సమీక్షించేందుకు హుస్సేన్‌సాగర్ తీరంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను సంస్థ చైర్మన్, ఎండీ జి.రఘుమారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా అదనంగా ఏర్పడే డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా కోసం 500 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 20, 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 7, 160 కేవీ సామర్థ్యంతో కూడిన 43 ట్రాన్స్ఫార్మర్లతోపాటు ..13 కిలోమీటర్ల మేర ఎల్టీ కేబుల్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీనికితోడు రోడ్ క్రాసింగ్‌లు, వదులుగా నున్న తీగలు సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవరమైన చోట ఇన్సులేషన్ ఏర్పాటు, ఇనుప స్తంభాలు, ఫ్యూజ్ బాక్సులు వున్నచోట పీవీసీ పైపులు, ప్లాస్టిక్ షీట్లు ఏర్పాటు పూర్తయ్యిందన్నారు. సర్దార్ మహల్, హుస్సేన్‌సాగర్, బషీర్‌బాగ్, గాంధీనగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని, విద్యుత్ సరఫరా తీరుతెన్నులను సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) జె.శ్రీనివాస్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తారని సీఎండీ తెలిపారు. ఎకడైనా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడితే 100 లేదా 1912తోపాటు ట్యాంక్‌బండ్ విద్యుత్ కంట్రోల్ కేంద్రం 7901530966 / ఎన్టీఆర్ మార్గ్ 7901530866 నంబర్లను సంప్రదించాలన్నారు.
శోభాయాత్ర నిర్వహించే 24 ముఖ్య ప్రాంతాల వద్ద చీఫ్ జనరల్ మేనేజర్/సూపరింటెండింగ్ ఇంజినీర్ స్థాయి అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. ఎన్టీఆర్మార్గ్ ప్రాంతానికి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టి.శ్రీనివాస్, ట్యాంక్‌బండ్ ప్రాంతానికి డైరెక్టర్ (ఆపరేషన్స్) జె శ్రీనివాసరెడ్డి, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సరిల్కు డైరెక్టర్ (పీఅండ్ ఎంఎం) సీహెచ్.మదన్మోహన్రావు, సంజీవయ్య పార్ ప్రాంతానికి డైరెక్టర్ డీపీఈ జి.గోపాల్, రంగారెడ్డి జోన్ ప్రాంతానికి డైరెక్టర్ (కమర్షియల్) కె.రాములు, సరూర్ నగర్ చెరువు ప్రాంతానికి డైరెక్టర్ (హెచ్ఆర్డీ) పర్వతం, చార్మినార్ ప్రాంతానికి డైరెక్టర్ (ఐపీసీ) ఎస్.స్వామిరెడ్డిని నియమించారు.
నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఉచిత తాగునీటిని అందించేందుకు జలమండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 3, 5, 7, 9వ రోజుల్లో నిమజ్జనం కోసం ఓఆర్ఆర్ పరిధిలో ఏర్పాటు చేసిన నీటి కొలనుల వద్ద 74 తాగునీటి శిబిరాలను నిర్వహించింది. శుక్రవారం జరగనున్న నిమజ్జనానికి అదనంగా మరో 122 తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న దారి వెంట , ట్యాంక్‌బండ్ పరిసరాలతోపాటు, నిమజ్జన కొలన్ల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేసి..మొత్తం 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. తాగునీటినందించేందుకు 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉంచుతారు. అలాగే శోభాయాత్ర జరిగే అన్ని రూట్లలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాటర్ లీకేజీలు, సివరేజీ ఓవర్‌ఫ్లోలు లేకుండా జలమండలి ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టింది. తాగునీటి శిబిరాల పర్యవేక్షణ, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసేందుకు నోడల్ అధికారులను నియమించడంతోపాటు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లో 2 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.
గ్రేటర్‌వ్యాప్తంగా జరిగే నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. శోభాయాత్రకు వచ్చే భక్తుల కోసం 565 ప్రత్యేక సిటీ బస్సులు అందుబాటులో ఉంచినట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. గ్రేటర్ చుట్టపక్కల నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఆయా రూట్లలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. ఎన్టీఆర్ మార్గ్, గాంధీ మార్గ్ అవుట్ పోస్టు, బషీర్‌బాగ్‌లోని కంట్రోల్‌రూమ్ ప్రాంతాల్లో ప్రత్యేక సమాచార కేంద్రాలతోపాటు రెండు కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు రేతిఫైల్ బస్‌స్టేషన్ 9959226154, కోఠి బస్‌స్టేషన్ 9959226160 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో ఈనెల 9,10 తేదీల్లో 8 ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు నడుపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. రోజువారీ సర్వీసులకు అదనంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తాయన్నారు.
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రోరైళ్లను శుక్రవారం అర్ధరాత్రి 1 గంట వరకు నడుపుతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చివరి రైలు రాత్రి 1 గంటకు రైలు బయల్దేరి 2 గంటలకు ఆఖరి స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచే సర్వీసులు ప్రారంభమవుతాయి.