సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో 1476 మంది దళితబంధుకు దరఖాస్తు చేసుకోగా, 1462 మంది ఖాతాలలో రూ. 10 లక్షల చొప్పున జమ చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. వీరిలో 1200 మంది లబ్ధిదారులకు కోరుకున్న యూనిట్లను అందజేసినట్లు చెప్పారు. మిగిలిన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా యూనిట్లను ఎమ్మెల్యేల సహకారంతో అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని ఆదేశించారు. గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో దళితబంధు పథకం అమలు తీరుపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, సాయన్న, ముఠా గోపాల్, స్టీఫెన్ సన్, జాఫర్ హుస్సేన్, పాషా ఖాద్రి, కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు అందజేసిన యూ నిట్లను సక్రమంగా వినియోగించుకొనే విధంగా అవసరమైన సహకారం అందించాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. డిమాండ్ ఉన్న రంగాలకు చెందిన యూనిట్లు ఎంపిక చేసుకొనే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటి వరకు యూనిట్లు పొందిన వారి వివరాలు, యూనిట్ ప్రస్తుత పనితీరు, సాధించిన ఫలితాలు తదితర వివరాలతో ఫొటో, వీడియోగ్రఫీని సేకరించి నివేదిక రూపంలో ఈ నెల 20 వ తేదీలోగా అందజేయాలని మంత్రి ఆదేశించారు.
మేడ్చల్, సెప్టెంబర్8(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత దళితబంధు లబ్ధిదారులను మరో 10 రోజులలో ఎంపిక చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో 7500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సహకారంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదటి విడతలో 563 మందికి రూ. 56.30కోట్లను జమ చేశారు. రెండో విడుత లబ్ధిదారుల ఎంపికకు త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు.