సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డులో మరో ప్రత్యేక ఆకర్షణకు శ్రీకారం చుడుతున్నది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఔటర్ సర్వీసు రోడ్ల వెంబడి మూడు వరుసలు.. 4.5 మీటర్ల వెడల్పుతో 23 కిలోమీటర్ల మేర నిర్మించే సైకిల్ ట్రాక్, దానిపై సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
టీఎస్రెడ్కో ఈ ప్రాజెక్టును చేపడుతున్నదని, సుమారు 16 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా డిజైన్ చేశామని, ఆ కరెంటును ఔటర్‌పై ఉండే వీధిదీపాలు, ఇతర అవసరాలకు వాడుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. దారి పొడవునా ఫుడ్ కోర్టులు, అత్యంత భద్రత కోసం సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.