సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): రోజు రోజుకూ హైదరాబాద్ మహా నగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలు దిక్కులా విస్తరిస్తున్నది. శివారు ప్రాంతాల్లో సైతం ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఐటీ కారిడార్‌లో రెండు కీలకమైన రెండు అభివృద్ధి పనులు చేపట్టింది. తెల్లాపూర్‌లోని రేడియల్ రోడ్డు నం:30 (ఎక్స్టెన్షన్) వెంబడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా 1000 ఎంఎం డయా ఆర్సీసీ ఎన్పీ-4 పైపులైనును ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా గండిపేట నుంచి చిల్కూరు, అజీజ్‌నగర్, నార్సింగి నుంచి మునిసిపాలిటీని కలుపుతూ మరో ఎన్పీ-4 1200 ఎంఎం డయా పైపుతో కాజ్వే నిర్మాణం చేసేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను వెచ్చించనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను ఇటీవలే పిలిచారు. ఈ నెల 21 తర్వాత టెండర్లను తెరిచి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించనున్నారు. ఈ పనులు పూర్తయితే వరద నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగనుంది. ఈ పనులు పూర్తయిన వెంటనే పెండింగులో ఉన్న రోడ్ల నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
ఔటర్ రింగు రోడ్డు ఇరువైపులా కొత్తగా నివాస ప్రాంతాలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్లు అయిన నిజాంపేట, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట, మీర్పేట్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్లతో పాటు మునిసిపాలిటీలు నార్సింగి, మణికొండ, దుండిగల్, కొల్లూరు, తుర్క యాంజాల్, జల్పల్లిల్లోనూ కొత్తగా నివాసాలు వెలుస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ పని చేస్తున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ఒకేసారి 37 వరకు మునిసిపాలిటీలు ఉండగా, వాటిలో పట్టణీకరణ ఎంతో వేగంగా చోటు చేసుకుంటోంది.
దానికి అనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనపై ఆయా మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు హెచ్ఎండీఏ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. స్థానిక మునిసిపాలిటీ నిధులతో పాటు హెచ్ఎండీఏ, ప్రభుత్వం నుంచి నిధులను సమకూర్చుకొని శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు.