సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రణాళికబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపడుతోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మౌలికవసతుల కల్పనపై ప్రధాన దృష్టి సారించింది. తాజాగా కొత్తగా మరో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేయనుంది.
శంషాబాద్-షాబాద్‌ల మధ్య వేలాది ఎకరాల్లో ఏర్పాటు చేసిన చందన్వెల్లి ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చందన్వెల్లి పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో భారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. దానికి సమీపంలోనే ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ, మెక్రోసాప్ట్ డేటా సెంటర్ వంటి ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ నెలకొన్నది. 111 జీవో పరిధి దాటిన తర్వాత హైతాబాద్-షాబాద్‌ల మధ్య హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో రెసిడెన్షియల్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో భారీ లేఅవుట్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేయనుంది.
ప్రభుత్వ భూమి హెచ్ఎండీఏకు అప్పగింత…
శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే మార్గంలో చందన్వెల్లి పారిశ్రామిక వాడకు సమీపంలో షాబాద్ రెవెన్యూ పరిధిలోని 311 సర్వే నంబర్లో సుమారు 200 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదే. దీన్ని ఖాళీగా ఉంచకుండా అత్యాధునిక మౌలిక సతులతో లేఅవుట్‌గా అభివృద్ధి చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇక్కడ నివాస ప్రాంతాలు ఏర్పాటు కావడానికి అవకాశం కలగనుంది. దీంతో ప్రభుత్వం అప్పగించిన భూమిని స్వాధీనం చేసుకున్న హెచ్ఎండీఏ అధికారులు దాన్ని చుట్టూ మొదట ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. సుమారు రూ.1.71 కోట్లతో లేఅవుట్ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు టెండర్లను దాఖలుకు ఈ నెల 13 తేదీ వరకు గడువు విధించారు. లేఅవుట్ స్థలం చుట్టూ చైన్ లింక్ మెష్‌ను ఏర్పాటు చేసి, డిమార్కేషన్ చేయనున్నారు. ఒకేచోట పెద్ద మొత్తంలో ప్రభుత్వం స్థలమే అందుబాటులో ఉండడంతో లేఅవుట్‌ను త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.