హిమాయత్‌నగర్, ఆగస్టు 28: దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు ఎంతో మంది వీరులు అర్పించిన ప్రాణ త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఏర్పడిందని పలువురు వక్తలు అన్నారు. ఆనాటి త్యాగధనుల పోరాటాలను స్మరించుకుంటూ వారు చూపిన బాటలో నడుచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, భారతీయం సత్యవాణి హాజరై మాట్లాడుతూ..
దేశ స్వాతంత్య్ర పోరాటంలో వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటేనని, ఆనాటి పోరాటయోధుల చరిత్రను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. యువత సరికొత్త అవకాశాలు, ఆలోచనలు, మార్గాలను అన్వేషిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు సూచించారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని పేర్కొన్నారు. దేశభక్తి పాటలకు విద్యార్థులు చేసిన నృత్యా లు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాధ, జి.ప్రసన్నలక్ష్మి, డాక్టర్ సంధ్యాదేవి, స్రవంతి, జానకి, సరిత తదితరులు పాల్గొన్నారు.