మాదాపూర్/ఖైరతాబాద్, ఆగస్టు 28: వేకువ జాము నెక్లెస్‌రోడ్ పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజా సందడిగా మారింది. ఎన్ఎండీసీ, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హైదరాబాద్ మారాథాన్-2022 ఉత్సాహంగా సాగింది. ఫుల్ మారథాన్‌ను ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ దేబ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంచ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నారాయణ టీవీ, రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా జెండా ఊపి ప్రారంభించగా, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, పీవీమార్గ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట ఫ్లై ఓవర్, బంజారాహిల్స్ రోడ్ నం.2, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్‌నం. 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, గౌలిదొడ్డి, గోపనపల్లి జంక్షన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు సాగింది.
అలాగే హాఫ్ మారాథాన్‌ను నార్త్ డిస్ట్రిక్ట్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎన్ఎండీసీ డైరెక్టర్ డీకే మహంతి,ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్య నాథన్ సైబరాబాద్ డీసీపీ, ఐఏఎస్ టి. శ్రీనివాస్ రావుతో కలిసి ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌లో 3240 మంది హజరు కాగా, 5కే రన్లో 5000 మంది, 10 కే రన్లో 5300 మంది పాల్గొన్నారు. అంతేకాకుండా 2500 మంది వలంటీర్లు కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ రన్నర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పలు ఏర్పాట్లను చేసింది. కేర్ హాస్పిటల్స్ 21 మెడికల్ స్టేషన్లలో 250 పారామెడికల్ సిబ్బందితో పాటు పూర్తి వసతులతో కూడిన 5 అంబులెన్సులు, గచ్చిబౌలి స్టేడియంలో 15 పడకల ఎమర్జెన్సీ సెటప్‌ను అందించారు. మారథాన్ పూర్తయిన అనంతరం ఎలైట్ అథ్లెట్లు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫుల్ మారథాన్, హఫ్ మారథాన్, 10 కే రన్లో స్త్రీ, పురుషుల కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు పొందిన వారి బిట్ సంఖ్య ఆధారంగా ఏర్పాటు చేసిన ఫుల్ మారథాన్ పురుషుల కేటగిరీల్లో బహుమతులను అందజేశారు.
మారథాన్‌లో విజేతల వివరాలు
మొదటి బహుమతి ప్రదీప్ సింగ్, రెండో బహుమతి రవి ప్రకాశ్, మూడో బహుమతి సైమన్ కిప్లాగట్ అందుకోగా మహిళల కేటగిరిలో మోనికా చెరుటో మొదటి బహుమతిని అందుకోగా, రేష్మా దత్తు రెండో బహుమతి, ప్రచీ గడ్బోలె మూడో బహుమతులను అందుకున్నారు. హాఫ్ మారథాన్‌లో పురుషుల కేటగిరీలో మొదటి బహుమతి కిముర్గర్ మార్టిన్ అందుకోగా రెండో బహుబతి ధర్మేందర్, మూడో బహుమతిని దినేశ్ కుమార్ అందుకున్నారు. మహిళల కేటగిరిలో మొదటి బహుమతి సంజీవని బాబురావ్ జాదవ్ అందుకోగా రెండో బహుమతి ఉజ్జల, మూడో బహుమతిని ఫరీన్ ఫిర్డోస్ అందుకున్నారు. 10 కే రన్లో పురుషుల కేటగిరీలో తుమ్మిటి దేని గితిరి అందుకోగా రెండో బహుమతి శుభం సింధు, మూడో బహుమతిని ఉపేంద్ర బాలియన్ అందుకోగా స్త్రీ కేటగిరీలో ప్రజక్తా గడ్బొలె, రెండో బహుమతి భార్తి నైన్, మూడో బహుమతిని ఆకాంక్ష సెలార్లు ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ దేబ్, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్య నాథన్, 11వ ఎడిషన్ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు.