ఖైరతాబాద్, ఆగస్టు 28 : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే నీచానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆ బాలికకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించగా, ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం….ఏపీకి చెందిన దంపతులు తమ కుమార్తె (మైనర్)ను ఇటీవల నగరంలోని పంజాగుట్టలో తెలిసిన వారి ఇంటికి తీసుకొచ్చారు.
బాలికను బషీర్బాగ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా, గర్భవతిగా తేలింది. గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ చేయాలని తండ్రి వైద్యులను కోరగా, అందుకు వారు నిరాకరించి పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బాలికను చేరదీసి సఖీ కేంద్రానికి తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వగా, తన తల్లి 11 నెలల పాటు ఇంట్లో లేని సమయంలో తన తండ్రి ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని, అదే క్రమంలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు పెట్టి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.