చిక్కడపల్లి, ఆగస్టు 28: గాయపడిన హృదయం నుంచే గజళ్లు పుట్టుకొస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జాలూరు గౌరీశంకర్ అన్నారు. మనిషిలోని సంఘర్షణ దుఃఖం, వేదననే గజల్ రచనలకు ఆత్మ అని ఆయన పేర్కొన్నారు. విశ్వ పుత్రిక గజల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గజల్ వర్క్‌షాప్, గజల్ ప్రతిభా పురస్కారాలు, సత్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం ప్రముఖ గజల్ కవియిత్రి డాక్టర్ విజయలక్ష్మి రచించిన ‘విశ్వరాగం’, ప్రముఖ రచయిత కళారత్న ‘గజల్ సౌందర్యం సమీక్షణం’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, సుప్రసిద్ధ కవి సాహితివేత్త జూలూరు గౌరీ శంకర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నలు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం, బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ, తెలుగు గజల్ వ్యాప్తి కోసం కృషి చేస్తామన్నారు. గజల్ హృదయాన్ని కదిలించి మైమరపించే సాహిత్య ప్రక్రియగా పేర్కొన్నారు.
ప్రఖ్యాత సాహితీవేత్త సదాశివ చెప్పినట్లు గాయపడిన హృదయంలో గజల్ మొదలవుతుందని గుర్తు చేశారు. గజల్ అంటే మనిషి అంతరంగానికి కన్నీటి భాష అని, అదే గజల్ రచనలకు గీటురాయిగా నిలుస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ గజల్ కవులు, గాయకులు సామాన్యుల భాషలో గజల్స్ రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ఆరెళ్ల రవి ప్రకాశ్, వై.ఎస్.శర్మ, ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి.విజయలక్ష్మి, సూరారం శంకర్, సుబ్రహ్మణ్యం శర్మ, బి.ఎన్.రమేశ్ శర్మ, తలారి ఆనంద్, అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.