కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 27 : కేపీహెచ్‌బీ కాలనీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని గత ఎనిమిదేండ్ల కాలం లో తాగునీటి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజల కోరిక మేరకు ఇండోర్ స్టేడియాలు, పార్కులను అభివృద్ధి చేసినట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం సాయంత్రం కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాలనీ ప్రజల సమస్యలపై ముఖాముఖి చర్చలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేపీహెచ్‌బీ కాలనీలో రూ.150 కోట్లతో రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులను చేపట్టి తాగునీటి సమస్యను, కేపీహెచ్‌బీ కాలనీ రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఫ్లైఓవర్, కాలనీ 7వ ఫేజ్‌లో అండర్‌పాస్ బ్రిడ్జి, కైత్లాపూర్‌లో ఆర్వోబీ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కాలనీ 6వ ఫేజ్‌లో ఇండోర్ స్టేడియం, 4వ ఫేజ్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్, రెండు చోట్ల మోడల్ మార్కెట్, ఫిష్, రైతుబజార్‌తోపాటు పలుచోట్ల ఇండోర్ స్టేడియాలు నిర్మించినట్లు తెలిపారు. పార్కులను అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తా..
ముఖాముఖిలో ప్రజలు సూచించిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రజలకు హామీనిచ్చారు. మంజీరా, ఇతర అపార్టుమెంట్లలో రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరిస్తానని కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో ఉన్నత పాఠశాల, ప్రభుత్వ వైద్యశాలను అందుబాటులోకి తెస్తానన్నారు. కాలనీ 6వ ఫేజ్ ఇండోర్ స్టేడియంలో ధరలను నియింత్రించేందుకు కృషి చేస్తానని డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. చెట్ల కొమ్మలు రోడ్లపై ఉండటం, చెత్తాచెదారం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ నుంచి గోపాల్‌నగర్‌కు వెళ్లే మార్గంలో, కైత్లాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. జేఎన్టీయూహెచ్ నుంచి కోకాపేట వరకు ప్రత్యేక ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందని, దీంతో ట్రాఫిక్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. ముందుగా కాలనీ 7వ ఫేజ్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిశీలించారు. అనంతరం కాలనీ 6వ ఫేజ్‌లో బతుకమ్మ కుంటకు శంకుస్థాపన చేసి.. పీవీఎన్ఆర్ పార్కులో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వి.మమత, ఎస్ఈ చిన్నారెడ్డి, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, పోలీస్, జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.