హిమాయత్‌నగర్, ఆగస్టు 24: కేంద్రంలో అధికారంలో ఉన్న అతివాద మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ, ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వ విలువలకు తూట్లు పొడుస్తూ, నేడు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే మతవిద్వేషాలు సృష్టిస్తున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా సీపీఐ 23వ మహాసభలు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో బుధవారం జరిగాయి.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చి సామాన్యుల పాలిట భూతంగా అవతరించారని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో భావ ప్రకటనకు ముప్పు ఏర్పడిందని, ప్రశ్నిస్తే దేశద్రోహులంటూ కేసులు లేదా ఈడీ, సీబీఐ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మతతత్వ నిరంకుశ పాలనకు, దోపిడీ, ప్రైవేటీకరణ, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమాన్ని కమ్యూనిస్టులు నిర్మించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ.. ఇతర మతాలను కించపరుస్తూ, ద్వేషపూరిత ప్రసంగం చేస్తూ బీజేపీ నేతలు దేశంలో విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడుకోవడం కమ్యూనిస్టులు, ప్రగతిశీలవాదుల అతి ముఖ్యమైన కర్తవ్యమని, వీటిని రక్షించుకోవడానికి ఎంతకైనా తెగించి పోరాటాలు చేయాలని అజీజ్ పాషా కోరారు. ఈ ప్రతినిధుల సభలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ.నరసింహ నివేదిక ప్రవేశ పెట్టగా, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.చంద్రమోహన్ గౌడ్, సమితి సభ్యులు పడాల నళిని, శక్తి బాయి, మహమూద్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.ఛాయాదేవి, ఎం. నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, సలీం ఖాన్, నిర్లేకంటి శ్రీకాంత్, షముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.