సుల్తాన్‌బజార్, ఆగస్టు 24: నేటి సమాజానికి అనుగుణంగా విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. బుధవారం కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలోని దర్బార్ హాల్లో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నేషనల్ యూత్ పార్లమెంటరీ-2022 కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ, అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ వ్యవహారాల అంశాలపై ప్రధానంగా చర్చించారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో స్పీకర్‌గా కె అనిరేచల్, సభా నాయకురాలిగా రాజేశ్వరి, ప్రతిపక్ష నాయకురాలిగా ఆశ వ్యవహరించారు. ప్రధానంగా విద్యార్థుల పార్లమెంట్లో జీఎస్టీ, మహిళా రిజర్వేషన్ బిల్లు, వ్యవసాయ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, గ్రీన్ ట్యాక్స్ బిల్లు, గూడ్స్, సర్వీస్ బిల్లు తదితర బిల్లులతో పాటు వివిధ చట్టాలను విశ్లేషిస్తూ నిజమైన ప్రజాప్రతినిధుల తరహాలో ప్రతి అంశంపై క్లుప్తంగా చర్చించి నూతన ఒరవడిని సృష్టించారు.
అనంతరం ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ.. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థినులు నిర్వహించిన యూత్ పార్లమెంట్ నిజమైన పార్లమెంట్‌ను తలపించిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు ఇటువంటి కార్యక్రమాలు సమాజంపై అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శైలజ, డాక్ట్టర్ వి. శ్రీలత, ఎస్సీసీ ఆఫీసర్ దీపికతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.