కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్ సమీక్ష
సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, పరీక్ష రాసేందుకు వచ్చే వారు నియమ నిబంధనలు పాటించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ సూచించారు. బుధవారం నాగోల్‌లోని నిమంత్రన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో రిజినల్ కోఆర్డినేటర్స్, నోడల్ అఫీసర్స్, సూపరింటెండెంట్స్, అబ్జర్వర్స్, ఇన్విజిలేటర్స్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన విద్యాసంస్థల ప్రతినిధులతో ఈ నెల 28న జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే వారు హాల్ టికెట్ మినహా ఎలాంటి గుర్తింపు కార్డు తీసుకురావాల్సిన అవసరం లేదని, బయోమెట్రిక్ విధానంతో అభ్యర్థుల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. వేలాది మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, పరీక్ష కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. అభ్యర్థులు పరీక్ష రోజు వరకు కష్టపడి చదవాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ శ్రీబాల, అదనపు డీసీపీలు లక్ష్మీనారాయణ, నర్మద, శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.