సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ) : జలమండలి నిర్వహణలో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏటా రూ.48-50 లక్షల మేర పైపులైన్ లీకేజీలు, సివరేజి మరమ్మతుల పేరిట ఖర్చు చేస్తున్నది. ఈ నిర్వహణను పారదర్శకంగా ఉండేందుకు ఏఎంఎస్ (వార్షిక నిర్వహణ విధానం)కు ప్రవేశపెట్టింది. సంస్థ ఓ అండ్ ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్) విభాగం పరిధిలో దాదాపు 400 మంది వరకు కాంట్రాక్టర్లు నమోదై ఉన్నారు. అయితే అత్యవసరాల పేరిట ఎక్కువగా పనులను నామినేషన్ల విధానంలో జరుపుతూ ఎల్వోసీ రూపంలో సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తూ వస్తున్నారు.
కానీ ఇకనుంచి టెండర్ ప్రక్రియ నిర్వహించి ఏడాదికిగానూ అర్హత గల ఏజెన్సీకి పనులను అప్పగించనున్నారు. సెక్షన్ల వారీగా ఏడాది వరకు టెండర్లు పిలిచి అర్హత గల ఏజెన్సీకి పనులు అప్పగించనున్నారు. సివరేజీ మ్యాన్‌హోళ్ల మూతలు పగిలితే కొత్తవి వేయడం, ఆర్సీసీ సివర్ లైన్లకు మరమ్మతులు, నీటి సరఫరా పైపులైన్ లీకేజీలను అరికట్టడం, చౌక్ రిపేర్లు, స్లూయిస్ వాల్వ్ రీప్లేస్మెంట్, కలుషిత నీటి నివారణ చర్యలు, ఎలక్ట్రికల్ వర్క్స్‌లో బూస్టర్స్, పవర్ బోర్‌వెల్స్, జనరేటర్లు, క్లోరినేషన్ రూం నిర్వహణ పనులు ఓ అండ్ ఎం కిందకు వస్తాయి.
ఈ పనులను ఇకమీదట నామినేషన్ల పద్ధతి ద్వారా కాకుండా ఏఎంఎస్ విధానం ద్వారా అప్పగించనున్నారు. తద్వారా దుబారాకు చెక్ పడడంతోపాటు పనులు అత్యంత పారదర్శకంగా, సకాలంలో జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో తొలిసారి ఏఎంఎస్ విధానం జలమండలిలో అమలు కావడం విశేషం.