మియాపూర్, ఆగస్టు 24 : మిషన్ భగీరథ పథకంతో ప్రతి గడపకు తాగునీటిని అందించటంలో సీఎం కేసీఆర్ సంపూర్ణ విజయం సాధించాడని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గంలో 18 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామన్నారు. వివేకానందనగర్ డివిజన్ వివేకానందనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సీడీపీ నిధులు సహా దాతల సాయంతో రూ. కోటి నిధులతో నిర్మించిన 9 లక్షల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన మంచినీటి నిల్వ సంపును కార్పొరేటర్ రోజాదేవితో కలిసి విప్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కాలనీలన్నింటికీ పైప్లైన్లను విస్తరించామని, ఏండ్ల నాటి తాగునీటి సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని, అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి అండగా నిలుస్తానని, అభివృద్ధికి పూర్తి తోడ్పాటును అందిస్తానని విప్ గాంధీ పేర్కొన్నారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, భాస్కర్రావు, రాంచందర్, హిమగిరి, మహేశ్, కాలనీ అధ్యక్షులు వడ్డేపల్లి రాజేశ్వర్రావు, నర్సయ్య, జయబాల్రెడ్డి, కుసుమకుమారి, శివారెడ్డి, రంగారావు, రాంచందర్రావు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం సీఎం చేతుల మీదుగా జరగనున్నందున నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మహిళా నేతలు హాజరై విజయవంతం చేయాలని విప్ గాంధీ కోరారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.