బంజారాహిల్స్, ఆగస్టు 24 : చెత్తా చెదారంతోపాటు పిచ్చి మొక్కలతో నిండిపోయిన పార్కు స్థలాన్ని ఫ్రీడమ్ పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో 15 రోజుల్లోనే రూపురేఖలు మారిపోయాయి. జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ పార్కుగా తయారు చేయాలని ఇటీవల అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు నిర్ణయించారు.
దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సర్కిల్ 18 డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి, యూబీడీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీనివాస్ కృషితో అద్భుతమైన ఫ్రీడమ్ పార్కుగా రూపుదిద్దుకుంటోంది. చెత్తాచెదారం, రాళ్లురప్పలు, బండరాళ్లను తొలగించడంతోపాటు అడ్డగోలుగా పెరిగిన పిచ్చిమొక్కలను తీసేశారు. పార్కులో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. సుమారు ఎకరం విస్తీర్ణంలోని ఈ పార్కులో సుమారు 75 రకాల వృక్షజాతులకు చెందిన 750 మొక్కలతోపాటు 75 రకాలైన పూలమొక్కలు, ఔషధ మొక్కలను నాటారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కులో ప్రవేశించగానే జాతీయ భావాన్ని పెంచేలా తీర్చిదిద్దుతున్నారు. పార్కు ప్రవేశ ద్వారాన్ని మువ్వన్నెల రంగులతో అలంకరించారు. లోనికి ప్రవేశించగానే ఫుట్‌పాత్‌తోపాటు ప్రహరీ, బెంచీలన్నింటికీ మువ్వన్నెలను వేస్తున్నారు.
వీటితోపాటు గోడలకు అద్భుతమైన రంగులు వేయడంతోపాటు స్వాతంత్య్ర పోరాటంలోని కీలక సన్నివేశాలు గుర్తువచ్చే చిత్రాలను కూడా వేయనున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుల శిల్పాలను కూడా పార్కులో ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.30లక్షల వ్యయంతో పార్కును మోడల్ ఫ్రీడమ్ పార్కుగా అభివృద్ధి చేస్తున్నామని జీహెచ్ఎంసీ యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ తెలిపారు.
వజ్రోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో 15 పార్కులను ఫ్రీడమ్ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో పార్కును ఏర్పాటు చేశాం. ఎగుడు దిగుడుగా ఉన్న ఈ ప్రాంతాన్ని చదును చేయడంతోపాటు మట్టిని తీసుకువచ్చి మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించారు. పార్కులో సమారు 7500కు పైగా పూల మొక్కలతోపాటు ఏపుగా పెరిగే వందలాది మొక్కలు నాటనున్నాం. ఫ్రీడమ్ థీమ్‌గా శిల్పాలు. పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఆగస్టు నెలాఖరులోగానే పనులన్నీ పూర్తి చేసి ఫ్రీడమ్ పార్కును సిద్ధం చేస్తాం.
– వీ.శ్రీనివాస్,డిప్యూటీ డైరెక్టర్, జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం