బేగంపేట్ ఆగస్టు 23 : సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో మంగళవారం తొలిసారిగా అత్యాధునిక బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీ, ఓమ్నీ సియంట్ న్యూరో టెక్నాలజీ వారి “క్విక్టోమ్”ను ఓమ్నీ సియంట్ న్యూరో టెక్నాలజీ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేఖెల్ సుగుహ్రే, కిమ్స్ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మాసస్ పాణిగ్రహి, కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస్ పాణిగ్రహి మాట్లాడుతూ న్యూరో సర్జన్ ప్లానింగ్‌లో ఈ టెక్నాలజీ ఒక మంచి ముందడుగని చెప్పారు.
గతంలో న్యూరో సర్జన్లు సమస్యలను ఖచ్చితంగా గుర్తించలేక పోయేవారని, ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కిమ్స్ న్యూరో సర్జన్లు సాధ్యమైనంత ఉత్తమమైన క్లినికల్ ఫలితాలను సాధించడానికి వీలుంటుందని తెలిపారు. డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ వైద్యులు అత్యుత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉపయోగపడే ఆత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని త్వరగా అందిపుచ్చుకోవడంలో కిమ్స్ ఆసుపత్రి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నాలజీ ఉపయోగంతో దేశంలోనే అత్యుత్తమ న్యూరో సైన్సెస్ కేంద్రంగా తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ చార్లెస్ టియా తదితరులు పాల్గొన్నారు.