సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ):అందరి సహకారంతో గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ అన్నారు. ఎల్బీనగర్లోని కుషాల్ కన్వెన్షన్‌లో మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ, పీస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి సీపీ హాజరై ప్రసంగించారు. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనంకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. వినాయక నిమజ్జనం చేసే చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని, జీహెచ్ఎంసీ సూచించిన చోటే నిమజ్జన కార్యక్రమాలు చేయాలని, భక్తులు కూడా అక్కడికే వెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్, మల్కాజిగిరి డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, రక్షిత, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పంకజ, తదితరులు పాల్గొన్నారు.