సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నగరంలో ఏటీసీసీ(ఆటోమెటిక్ ట్రాఫిక్ కౌంటింగ్ అండ్ క్లాసిఫికేషన్) కెమెరాల ఏర్పాటు చురుకుగా సాగుతున్నది. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ఏటీసీసీ తప్పనిసరి అవసరమవుతుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు రోడ్ల విస్తరణ, రోడ్ల అనుసంధానానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఈ కెమెరాల నుంచి వచ్చే డేటాతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని విశ్లేషణ చేస్తుంది. నగరంలో ఐటీఎంఎస్ (ఇంటలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 250 జంక్షన్లలో నూతన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. ఆయా కేంద్రాలలో 175 ఏటీసీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కెమెరాల ఏర్పాటు దాదాపు పూర్తయ్యింది. అయితే ఇందులో కొన్నింటికి కనెక్టివిటీ పూర్తి కాలేదు. ఇది పూర్తయితే ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఆయా కూడళ్లలో వాహనాల రద్దీని బట్టి పనిచేసే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు.
ట్రాఫిక్ రద్దీ నియంత్రణ
నగరంలో ట్రాఫిక్ ఉదయం, సాయంత్రం కార్యాలయాలకు వెళ్లి వచ్చే సమయంలో రద్దీగా ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ సమయంలోనే వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. ఈ సమయానికి, మిగతా సమయానికి 30 శాతం తేడా ఉంటుంది. రద్దీ సమయాలలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు కొన్ని కూడళ్లను మూసివేయడం, రోడ్డు అవతలి వైపు రోడ్డు స్థలాన్ని వాడడం చేస్తుంటారు. అయితే నగర విస్తరణ వేగంగా జరుగుతుంది. వేల సంఖ్యలో ప్రతి నెల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.
నగరవాసులే కాకుండా, జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి కూడా హైదరాబాద్‌కు వచ్చిపోయే వాహనాలుంటాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలే కాకుండా శివారు ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. ఒక కూడలిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అక్కడ తీసుకునే చర్యలు కొన్నాళ్లకే పరిమితమవుతున్నాయి. ఐదారునెలల్లోనే ట్రాఫిక్ రద్దీ అక్కడ పెరుగుతుంది. ఇలాంటి వాటిపై ఎప్పటికప్పుడు దృష్టి సారించేందుకు ఏటీసీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
సిగ్నలింగ్ వ్యవస్థకు..
నూతన సిగ్నలింగ్ వ్యవస్థలో ఆటోమెటిక్‌గా సిగ్నల్స్ పనిచేసే వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఏటీఎస్ కెమెరాలు రోజు, గంటల వారిగా ట్రాఫిక్ రద్దీకి సంబంధించి లెక్కలను ఎప్పటికప్పుడు అందజేస్తుంది. ఈ కెమెరాలు ఇచ్చే డేటాలతో ఆయా కూడళ్లలో సిగ్నల్స్ టైమింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఒక సమయంలో ఒక వైపు నుంచి ట్రాఫిక్ ఎక్కువగా వస్తుంటుంది, మరోవైపు నుంచి తక్కువగా ఉంటుంది. ఆ రద్దీని అంచనా వేసుకొని రెండు వైపుల సిగ్నల్ టైమర్‌ను ఏర్పాటు చేస్తారు. వాహనాల రద్దీని బట్టి ఆటోమెటిక్ ఆయా కెమెరాలు పనిచేసే విధంగా ఉంటాయి.
అన్ని శాఖల సమన్వయం
ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, రెవెన్యూ, ఆర్టీఏ, విద్యుత్, జలమండలి ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసేందుకు ఈ కెమెరాలు ఇచ్చే డేటా ఎంతో ఉపయోగపడుతుంది. నగరంలో అందుబాటులోకి వచ్చిన సీసీసీ(కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్)కు ఈ కెమెరాలను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు ఆ డేటాను విశ్లేషిస్తుంటారు. నగరాభివృద్ధిలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాత్ర కీలకంగా ఉంటుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇతర విభాగాలతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్ వ్యవస్థపై ముందుచూపుతో చర్యలు తీసుకుంటుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి. ఎన్ని వాహనాలు పెరుగుతున్నా ట్రాఫిక్ సాఫీగా హైదరాబాద్‌లో సాగిపోవడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటూ ట్రాఫిక్ విభాగం తీసుకుంటున్న పలు చర్యలే కారణం.