సికింద్రాబాద్, ఆగస్టు 19: హైదరాబాద్ నగర తొలి మేయర్‌గా నగర అభివృద్ధికి, ముదిరాజ్‌ల ఐక్యత కోసం కృషి చేసిన కొరివి కృష్ణస్వామి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. రాష్ట్రంలోని ముదిరాజ్‌ల అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉందన్నారు.
ఈ మేరకు శుక్రవారం కంటోన్మెంట్‌లోని జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) వద్ద ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి విగ్రహాన్ని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, వైద్య సేవలు, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే సాయన్న, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్‌లకు సర్కారు అండగా ఉంటున్నదని, త్వరలోనే నగరంలో ముదిరాజ్‌లకు ప్రత్యేక భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చి, ముదిరాజ్‌ల ఐక్యతను చాటడం గొప్ప విషయమన్నారు.
ఈ సందర్భంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ చేసిన సేవలను మంత్రులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ప్రతినిధులు పిట్ల నగేశ్ ముదిరాజ్, ఆగం పాండు ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, భాస్కర్ ముదిరాజ్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు, బోర్డు మాజీ సభ్యులు నళినీ కిరణ్, పాండు యాదవ్, ప్రభాకర్, నేతలు టీఎన్ శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, మురళీయాదవ్, ప్రవీణ్ యాదవ్, రాజుసింగ్తో పాటు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మేయర్ కృష్ణస్వామి సేవలు శ్లాఘనీయం
హిమాయత్‌నగర్, ఆగసు 19: బహుజన సమాజ సంస్కర్త, హైదరాబాద్ నగర తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ సమాజానికి అందించిన సేవలు మరవలేనివని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. కృష్ణస్వామి జయంతి సందర్భంగా శుక్రవారం హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో కృష్ణస్వామి చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర సలహాదారుడు పిట్టల రవీందర్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, రాష్ట్ర కో ఆర్డినేటర్ బొక్కా శ్రీనివాస్, నాయకులు రవికాంత్, చంద్రకాంత్, కనుకయ్య, రంజిత్, ప్రకాశ్, శారద, దీపిక, సతీశ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.