సిటీబ్యూరో, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): తెలంగాణ నాడు ఎండిన పొలాలతో సతమతమైతే.., నేడు నిండిన చెరువులతో పచ్చని పైర్లతో పరవశించిపోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.భాస్కర్ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే ఫొటో ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ సంతోష్ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఒకప్పటి నెర్రెలు బారిన నేల.., నేడు హరితవనాలను ప్రతిబింబిస్తున్నదని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు, ఐటీ టవర్లు, పరిశ్రమలు ఎన్నో రకాల అద్భుతమైన ఫొటోలు, ప్రగతిని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రకృతి ప్రేమికుడు ఎంపీ సంతోష్ తీసిన వైల్డ్‌లైఫ్, ప్రకృతి ఫొటోగ్రఫీని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. జర్నలిస్టులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని గుర్తు చేశారు.
చిత్రం ఒక భావోద్వేగం
ఎంపీ సంతోష్ కుమార్
ఒక చిత్రం ఒకప్పుడు 10 వేల పదాలతో సమానమని, ప్రస్తుతం ఫొటో అంటే ఒక ఎమోషన్ (భావోద్వేగాన్ని పంచేది) అని రాజ్యసభ సభ్యుడు సంతోష్ పేర్కొన్నారు. హృదయాంతరాలంలోని అంశాలను నొక్కిచెప్పేది అని అన్నారు. అన్ని రంగాల్లోని ఫొటోలు ఆకట్టుకునేలా ఉన్నాయని, ఈ సందర్భంగా ఫొటో అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. అనంతరం, అల్లం నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చి న తర్వాతే వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు, రంగాల్లో ఘననీయ మార్పులు వచ్చాయని అన్నా రు. అసోసియేషన్ అధ్యక్షుడు జి.భాస్కర్ మాట్లాడుతూ, ఎగ్జిబిషన్‌కు ఎంట్రీలు 256 వచ్చాయని, మొత్తం 626 ఫొటోలు రాగా, 504 ఫొటోలు ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, బీసీ కమిషన్ కిశోర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, కోశాధికారి సర్వేశ్రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ శెట్టి, ఈసీ మెంబర్ చిన్న యాదగిరి గౌడ్, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ పరమేశ్ గౌడ్, రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్టు సంఘం నాయకులు మారుతీసాగర్, ఇస్మాయీల్ పాల్గొన్నారు.