సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్ : అనేక మంది వీరుల త్యాగాల ఫలితంగానే స్వేచ్ఛాయుత భారతావని ఆవిర్భవించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్లో భారత జాతీయ పతాకంలో ఆవిర్భావం నుండి జరిగిన మార్పులు, చేర్పులను వివరిస్తూ హెచ్ఎండీఏ, ఫ్లాగ్స్ అండ్ పోల్స్, పిల్వెక్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ పదకొండు సార్లు పలు మార్పులు, చేర్పులు జరిగిన తర్వాత రూపుదిద్దుకున్నదే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జాతీయ పతాకం అని చెప్పారు. దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో స్వాతంత్ర పోరాట వీరులను స్మరించుకుంటూ వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ పతాకం చరిత్రను తెలియజెప్పేలా ప్రదర్శనను ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ అధికారులను మంత్రి అభినందించారు.
అదేవిధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహత్మాగాంధీ గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రభుత్వం గాంధీ చిత్రాన్ని అన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో ఎకడి వారు అకడే పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముందు గా మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ప్యారడైజ్ నుంచి సంజీవయ్య పార్ వరకు జాతీయ పథకాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, ఈఈ శంకర్, డీఈ దేవేందర్, పిల్వెక్స్ సొసైటీ నిర్వాహకులు పద్మావతి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ పాల్గొనాలి..!
16న ఉదయం 11.30 గంటలకు నగర వాసులంతా ఎకడి వారు అకడే నిలబడి జాతీయ గీతాలాపన చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ కోరారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, మాల్స్, సినిమా థియేటర్లు, తదితర షాపుల యజమానులు తప్పని సరిగా సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలని కమిషనర్ తెలిపారు. 16న సాయంత్రం 3గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దేశ భక్తిపై కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.