చార్మినార్, ఆగస్ట్ 9;కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో అమరులైన తమ పూర్వికులను స్మరించుకుంటూ షియా వర్గీయులు సంతాప దినాలను పది రోజులుగా పాటించారు. మొహర్రం మాసంలో పదోరోజున షియా వర్గీయులు యుద్ధంలో మరణించిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మాతం నిర్వహించారు. ఇమాం హసన్, హుస్సేన్‌లకు గుర్తులుగా హస్తాకృతిని పోలిన రూపాలను అలంకరించి వారి ముందు బాధాతప్త హృదయాలతో షియా వర్గీయులు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వేలాది మంది షియా వర్గీయులు నివాళులర్పిస్తూ ముందుకు సాగారు. హజ్రత్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ ఏనుగుపై ఆలంలను ప్రతిష్టించి హుస్సేన్ ఆలం ముందు త్యాగ నిరతి ప్రదర్శించారు. పదునైన కత్తులతో తమ శరీరాలను గాయపర్చుకుంటూ రక్తాన్ని చిందించారు. బీబీకా అలావా నుంచి ప్రారంభమైన మాతం ర్యాలీ డబీర్ఫుర మీదుగా షేక్ ఫౌజ్ కమాన్, యాకుత్ఫుర దర్వాజా, ఎత్తేబార్చౌక్, కోట్ల అలీజా, చార్మినార్, గుల్జర్ హౌస్, ఫంజేషా, దారుల్ షిఫా, ఇమ్లిబన్, చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. పలువురు ప్రముఖులు మాతం ర్యాలీలో ఆలంలకు దట్టీలు సమర్పించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.