సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) ;ఒక్క పెగ్గుతో మొదలయి.. బాటిల్ ముగిసే వరకు వదలని జబ్బు మద్యం అలవాటు. ఆరోగ్యం, కుటుంబం, గౌరవం కోల్పోతున్నా.. ఇసుమంతైనా బాధ లేని మాయా ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ‘ఒక్క మద్యం ఉంటే చాలు..ఈ సమాజంతో సంబంధం లేదు..’ అనే ధోరణి మందుబాబులను వెంటాడుతుంది. వాళ్లు మద్యానికి బానిసగా మారామనే విషయాన్ని కూడా వారు అంగీకరించరు. మద్యం ఎంతో మంది జీవితాలను తీసుకుంటూనే ఉంది. అయినా ఆ రక్కసిని వదులుకోవాలని ఏనాడూ అనుకోరు. ఫలితంగా చివరికి అన్ని బంధాలకు దూరమై చావుతోనే వారి కథ ముగుస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అలాంటి మందుబాబులను మార్చలేమా? వారితో మద్యాన్ని మాన్పించలేమా? అనే ఆలోచనలు చేసిన ‘ఆల్కహాలిక్స్ ఎనానిమస్’ సంస్థ ఒక యజ్ఞంలా మందుబాబుల్లో పరివర్తన తీసుకొస్తున్నది. ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి మద్యం..నష్టం వివరాలను బోధిస్తున్నది. మందు ఎందుకు మానెయ్యాలి? అనే ప్రశ్నకు దీటైన జవాబులతో విభిన్న అంశాలతో కూడిన పుస్తకాలను ముద్రించింది. గల్లీ నుంచి ప్రపంచం వరకు ఇప్పుడు ఈ సంస్థలో సభ్యులుగా చేరి మద్యాన్ని మానేసిన వారు వేలాది మంది ఉన్నారు.
ఆల్కహాలిక్స్ ఎనానిమస్ అనే సంస్థ 1935 జూన్ 10న ఆవిర్భవించింది. న్యూయార్క్‌కు ఇద్దరు మందుబాబులు మందు మానెయ్యాలని నిర్ణయించుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరి మధ్య అనేక చర్చలు జరిగాయి. తాగుడు మానడానికి ఏం చెయ్యాలో చర్చించి ఓ పద్ధతిని కనుగొన్నారు. నాలుగేండ్లలో వారిని అనుసరించి వందలాది మంది తాగుడు మానడానికి ముందుకొచ్చారు. మద్యం వల్ల కలిగే నష్టాలపై 1939లో వారంతా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అదే ఆల్కహాలిక్స్ ఎనానిమస్. ఈ పుస్తకం పేరే సంస్థ పేరుగా 193 దేశాల్లో ఉంది. 30 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. తాగుడు ఆపాలనే కోరిక ఉంటే చాలు సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. అలా 1950లో ఇండియాలోకి వచ్చింది. మన దేశంలో కెనడియన్ ఎంబసీలో పనిచేసే ఓ వ్యక్తి ‘ఏఏ’ వివరాలను ఒక పత్రికలో ప్రకటన ఇచ్చారు. అది చూసిన ముంబైకి చెందిన ఓ స్కూల్ హెడ్ మాస్టారు వారిని సంప్రదించి తాగుడు మానేశాడు. అలా అన్ని రాష్ర్టాలకు చేరింది. తెలుగు రాష్ర్టాల్లోనూ ఈ సంస్థకు వేలాది మంది సభ్యులు ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రతి రోజు 8 ప్రాంతాల్లో సమావేశాలు జరుగుతాయి.
ఎలా మందు మాన్పిస్తారు
ఉదయం లేవగానే.. ఇక తప్పనిసరిగా తాగాల్సిందేనని అనిపిస్తుంటే వారు ఆల్కహాల్‌కు అలవాటు పడినట్టే. రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించడానికి మద్యం అవసరమవుతున్నదంటే తాగుడు సమస్య ఉన్నదనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇతరులు కావాలనుకుంటే తాగుతారు..లేదా వదిలేయగలుగుతారు. అలా ఎందుకు మానేయలేకపోతున్నామో తెలుసుకోవాలి. ఇలాంటి వాస్తవ అంశాలతో మందుబాబులను పరీక్షించుకునేలా ప్రశ్నలతో ఆలోచన రేకెత్తిస్తారు. అప్పటికీ మందు మానేసిన వ్యక్తులు వారి జీవితంలో మద్యం ప్రభావం ఎలా ఉండేదో వివరిస్తారు. వారికి జరిగిన నష్టం చెబుతారు. చావు అంచుల వరకు వెళ్లాల్సి వచ్చిన ఆ సందర్భాలను వివరిస్తారు. ఇలా ప్రతి ఒక్కరూ వారి అనుభవాలను పంచుకుంటారు. మద్యం మానడానికి వారు అవలంబించిన పద్ధతులను సూచిస్తారు.
భార్య పర్సులో డబ్బు దొంగలించాను
చిన్నప్పుడే మద్యం అలవాటైంది. మొదట్లో శుభకార్యాలు జరిగినప్పుడు తాగేవాళ్లం. అది కాస్త వీకెండ్‌కు మారింది. అలా ప్రతీరోజు మద్యం తాగకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంట్లో హెచ్చరించినా పట్టించుకోలేదు. తాగుడు కోసం అబద్ధాలు మొదలుపెట్టాను. భార్య పర్సులో డబ్బులు దొంగిలించేవాణ్ణి. నా కొడుకు ఫారిన్లో చదువుతున్నాడు. నేను అనారోగ్యంతో దవాఖానలో చేరాను. నా భార్య కొడుక్కి సమాచారం అందించింది. కొడుకుగా పుట్టినందుకు వైద్య ఖర్చులు భరిస్తాను. కానీ నేను అతడి ముఖం మాత్రం చూడను అని ఫోన్ పెట్టేశాడు. అయినా తాగలేక ఉండలేకపోయాను.
ఓ రోజు మా అమ్మ నన్పు పీకపిసికి చంపేయ్ రా.. నేను చస్తే నువ్వు తలకొరివి పెట్టాలి. కానీ నువ్వు తాగుడుకు బానిసై నేను తలకొరిగి పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నావు.. అని వెక్కివెక్కి ఏడ్చింది. ఆ సంఘటన జరిగాక కూడా నేను వైన్‌షాప్‌కు వెళ్లి మద్యం తాగాను. నేను ఎందుకు తాగలేకుండా ఉండలేకపోతున్నానో తెలిసేది కాదు. నాకు ట్రీట్మెంట్ అందించిన ఓ డాక్టర్ సలహాతో ఆల్కహాలిక్స్ ఎనానిమస్లో చేరాను. వారి చెప్పినవీ పాటించాను. ఇప్పుడు నేను నాన్ ఆల్కహాలిక్. నా కొడుకు నాతో మాట్లాడుతున్నాడు. నా కుటుంబంతో సంతోషంగా ఉన్నాను.
–సత్యమూర్తి, ఆల్కహాలిక్స్ ఎనానిమస్ సభ్యుడు
ఎలా సంప్రదించాలి?
నగరంలో బేగంపేటలో ఆల్కహాలిక్స్ అనానిమస్ కార్యాలయం ఉంది. 9133974477, 9666466118/9 నెంబర్లను సంప్రదిస్తే ఏఏ ప్రతినిధులు వివరాలను చెబుతారు. సభ్యత్వం ఉచితంగానే ఉంటుంది. ప్రాంతాల వారీగా సమావేశాలు ఉంటాయి.
బంజారాహిల్స్-9949577975, సికింద్రాబాద్-9573841578, బేగంపేట- 9849010002,
జూబ్లీ బస్టాండ్ పరిధిలో- 9985335929, కొత్తపేట-6301637367, నారాయణగూడ-9701239319, వెంగళరావు నగర్- 9248666706, విద్యానగర్ 7386611649, ఖైరతాబాద్-9948334411, నానకరాంగూడ- 8463999979, మాదాపూర్-8978218080 నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు వెల్లడించారు.