వెంగళరావునగర్, ఆగస్టు 6 : బుడిబుడి నడకల బుజ్జాయిల్నే కాదు..నడిచివచ్చే బిడ్డల్ని కూడా తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ దత్తత ఇస్తుంది. కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చిన బిడ్డలు వారు.. పెద్ద పిల్లల్ని దత్తత తీసుకునేందుకు చాలా మంది దంపతులు మక్కువ చూపిస్తున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు ఒత్తిళ్లతో పిల్లలు పుట్టడం లేదు. జీవితంలో ఎంత సంపాదించినా పిల్లలు కలుగకుంటే అదో వెలితి. అలాంటి దంపతులకు దత్తత అనేది ఓ వరం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ www.cara.nic.in వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. దంపతులతో పాటు..ఒంటరి మహిళ, ఒంటరి పురుషులకు కూడా నిబంధనల ప్రకారం పిల్లల్ని అధికారులు దత్తతకు ఇస్తారు.
బిడ్డకు నేను..నాకు బిడ్డే తోడు..
కట్టుకున్న భార్య విడాకులతో దూరమైంది. తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. తనకూ ఐదు పదుల వయస్సొచ్చింది. తనకంటూ ఓ కుమారుడు ఉండాలని భావించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ వెబ్ సైట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగికి హైదరాబాద్ చిల్డ్రన్ హోంలో 11 ఏళ్ల ఓ బాబు దత్తతకు సిద్దంగా ఉన్నాడని అధికారులు చెప్పారు. బాబును దత్తతకు తీసుకుని స్కూల్లో చేర్పించి చదువులు చెప్పించే ప్రయత్నం చేశారు. తొలినాళ్లల్లో బాబు మారాం చేసినా..తండ్రి మనస్సెరిగిన ఆ బాలుడు ఆ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు.
దత్తతకు పదిహేడేళ్ల బాలిక..
అనంతపురానికి చెందిన దంపతుల వయస్సు యాభైఏళ్ల పైనే..వారికి పిల్లలు కలుగలేదు. ఓ సిమెంట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే అతను ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం. సిమెంట్ కంపెనీ ఇచ్చిన క్వార్టర్స్‌లోనే నివాసం ఉండేవారు. అతనికి 53 ఏళ్లు. అతని భార్యకు 51 సంవత్సరాలు. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. సంతానం మాత్రం కలగలేదు. అలా కాలం గడిచిపోయింది. నడివయస్సుకు వచ్చేశారు దంపతులు. దత్తత కోసం స్త్రీ, శిశు సంక్షేమశాఖ వెబ్ సైట్లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ స్టేట్‌హోం ఆవరణలో ఉన్న హోంలో 17 ఏళ్ల బాలిక దత్తత ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అధికారుల ద్వారా తెల్సుకుని స్టేట్ హోంకు వచ్చారు. పాపను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాప అమ్మానాన్న అంటూ వారిని పిలుస్తుంటే..వారి ఆనందానికి అవధుల్లేవు.
దత్తతలో ఆడపిల్లల అగ్రస్థానం
ఈరోజుల్లో మగపిల్లలు తల్లిదండ్రుల్ని సరిగా చూడరనే భావన చాలామందిలో ఉంది. ఆడపిైల్లెతే ఎంతో ప్రేమగా చూసుకుంటుందని దంపతులు భావిస్తూ..ఆడపిల్లల్నే ఎక్కువగా దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. చిన్నపిల్లల్ని దత్తత తీసుకోవాలంటే మూడేళ్లకు పైగా పడుతుంది. కాస్త ఎదిగిన బిడ్డలు కావాలంటే మాత్రం ఆరు నెలల్లోనే దత్తతకు ఇస్తున్నారు. 2020వ సంవత్సరంలో హైదరాబాద్ నగరం నుంచి ఓ ఆడపిల్లను దత్తతకు ఇచ్చారు. 2021లో ఓ బాలుడు, ఐదుగురు ఆడపిల్లల్ని దత్తతకు ఇచ్చారు. 2022 జూలై వరకు నలుగురు బాలురు, 15 మంది బాలికలను దత్తతకు ఇవ్వడం గమనార్హం. దత్తతలో ఆడపిల్లలే అగ్రస్థానంలో ఉండటం విశేషం.
అన్నీ ఆరాతీసి..విచారణ చేశాకే దత్తత
దత్తత కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాక.. సామాజిక విచారణ జరుపుతాం. పిల్లలను వారు బాగా చూసుకుంటారని నమ్మకం కలిగాకే ఆ దంపతులకు లేదా..ఒంటరి మహిళ, ఒంటరి పురుషుడికి నిబంధనల ప్రకారం దత్తత ఇస్తాం. దత్తతకు వెళ్లాక కూడా అక్కడ బిడ్డ ఎలా ఉన్నారనే విషయంలో ఆరా తీస్తుంటాం. ఇప్పుడు చిన్న పిల్లల్నే కాకుండా..పెరిగిన పిల్లల్ని కూడా దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం.
– పి.శారద, రీజనల్ జాయింట్ డైరెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ
దత్తత తీసుకోవాలంటే..