మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 6 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించనున్న వజ్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు పాటిస్తున్నామని, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వారికి వజ్రోత్సవాల కార్యక్రమాలను వివరిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈఓ దేవసహాయం, ఏఓ వెంకటేశ్వర్లు, డీఈఓ విజయకుమారి, ఆర్టీవో కిషన్, డీపీఆర్వో పద్మజారాణి, జిల్లా అధికారులు బలరామారావు, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో..
ఘట్కేసర్,ఆగస్టు 6 : పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించారు. ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ బి. కొండల్‌రెడ్డి సమావేశాల్లో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాల పై కౌన్సిల్ సభ్యులతో చర్చించారు. కమిషనర్ సురేశ్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్లో..
పీర్జాదిగూడ, ఆగస్టు 6: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో పట్టణ ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వజ్రోత్సవాల నిర్వహణపై, చేపట్టాల్సిన పనుల పై అధికారులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో నిర్వహించే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశం సాధించిన విజయాలు, స్వాతంత్య్రం కోసం పారాడిన విజయగాథలను వివరించే కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంట జాతీయ జెండా ఎగుర వేయాలన్నారు. కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్, మూడుచింతలపల్లి మండలంలో..
మేడ్చల్ రూరల్, ఆగస్టు 7 : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని మేడ్చల్ ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం వజ్రోత్సవాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటేశం, ఎంపీడీవో రమాదేవి పాల్గొన్నారు. మూడుచింతపల్లి మండలంలో వజ్రోత్సవాలపై ఎంపీడీవో రవి ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.