బేగంపేట్ ఆగస్టు 6: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్ని కాలనీలు, బస్తీలలో వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… ఈ నెల 22 వరకు నిర్వహించే స్వా తంత్య్ర భారత 75 వ వజ్రోత్సవ వేడుకలను 8న సీఎం కేసీఆర్ హైటెక్స్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. అం దులో భాగంగా ఈ నెల 9న ఇంటింటా జాతీయ పతాకాల పంపిణీ, 10న మొక్కలు నాటడం, 11న ఫ్రీడమ్ రన్, 12న రాఖీ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు, 13న విద్యార్థుల యు వతీ యువకులు మహిళలు వివిధ వర్గాల భాగస్వామ్యంతో ర్యాలీలు, 14న నియోజకవర్గాల కేంద్రాల్లో సాంస్కృతిక జానపద కార్యక్రమాలు, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న సామూహిక జాతీయ గీతాలాపన,17 రక్తదాన శిబిరాలు, 18న క్రీడల నిర్వహణ, 19న దవాఖానలు, అనాథ ఆశ్రమాలు, జైళ్లలో మిఠాయిల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న అసెంబ్లీల ప్రత్యేక సమావేశం, 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు వచ్చేలా చూడాలన్నారు. కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, ఆకుల రూప పాల్గొన్నారు.