మియాపూర్/కొండాపూర్, ఆగస్టు 6 : శ్రావణమాసం కావడంతో ఆలయం దారిలో చెత్తను తీసుకెళ్లే స్వచ్ఛ ఆటోలకు స్థానికులు అభ్యంతరం తెలుపడంతో అధికారులు కొత్తదారిని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే తాజాగా ప్రత్యామ్నాయ మార్గంలోనూ గ్రామస్తులు అభ్యంతరం తెలుపడంతో శనివారం డ్రైవర్లు స్వచ్ఛ ఆటోలను చందానగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట నిలిపి నిరసన తెలిపారు. సర్కిల్ వ్యాప్తంగా రోజువారీ సేకరించే చెత్తను స్వచ్ఛ ఆటోలు దీప్తిశ్రీనగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నాయి. శ్రావణమాసం సందర్భంగా ఈ దారిలో ధర్మపురి దేవాలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు స్వచ్ఛ ఆటోల రాకపోకలకు అభ్యంతరం తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు ప్రత్యామ్నాయంగా మియాపూర్ మక్తా విలేజ్ నుంచి డంప్ యార్డుకు ఆటోలకు దారి చూపారు.
ఇరుకైన దారి కావటంతో గ్రామస్తులు ఆటోలను అడ్డుకున్నారు. దీంతో చెత్తతో ఉన్న ఆటోలన్నింటినీ సర్కిల్ కార్యాలయం ఎదుట నిలిపి తమ నిరసన తెలిపారు. తక్షణమే స్పందించిన డీసీ సుధాంశ్ మక్తాదారిలో మట్టిని నింపి మరింత పటిష్టం చేయించారు. దీంతో గ్రామస్తులు సైతం అంగీకరించడంతో సాయంత్రం నుంచి యథావిధిగా స్వచ్ఛ ఆటోలు నూతన దారి మీదుగా డంప్ యార్డుకు చెత్తను తరలించాయి. సర్కిల్ అధికారుల అభ్యర్థన మేరకు మియాపూర్ సీఐ తిరుపతిరావు సైతం మక్తా దారితోపాటు డంప్ యార్డు ప్రాంతాన్ని పరిశీలించారు. సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, రాంకీ ప్రతినిధులు వారి వెంట ఉన్నారు.