మియాపూర్/కొండాపూర్/శేరిలింగంపల్లి/మాదాపూర్, ఆగస్టు 6 : కోట్లాది మంది తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను కలిగించి ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. యావత్ తెలంగాణ ప్రజలంతా ఆయన చూపిన బాటలో పయనించాలన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా శనివారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి విప్ గాంధీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడని, ఆకాంక్షను నిజం చేసుకోవడంలో ప్రజలంతా పిడికిలి బిగించేలా చేశాడన్నారు. సార్ కలలని సీఎం కేసీఆర్ నిజం చేశారని, బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పారదర్శక, జనరంజకమైన పాలనతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని విప్ గాంధీ పేర్కొన్నారు. సార్ కలలు కన్న బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి, కాశీనాథ్, మోజెస్, రాము, యూసుఫ్, శ్రావణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్లో..
తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమ స్ఫూర్తిదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని శనివారం కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో కమాండెంట్ పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అదనపు కమాండెంట్ టీ గంగారామ్, టీఎన్ సింఘ్, అసిస్టెంట్ కమాండెంట్స్ వీ నర్సింహస్వామి, రహమాన్, డీ సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శేరిలింగంపల్లిలో…
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. గచ్చిబౌలి డివిజన్లోని ఖాజగూడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చెన్నంరాజు, రాగం జంగయ్య యాదవ్, నరేశ్, యాదగిరి, నారాయణ, అనిల్, గోవింద్, అంజమ్మ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు వీరేశంగౌడ్, రాంచందర్, గోవిందచారి, బసవయ్య, రవియాదవ్, గోపాల్, రవీందర్, కిశోర్, మహిళా నాయకురాళ్లు ఫర్వీన్బేగం, రజనీ, సౌజన్య, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
మాదాపూర్లో..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా శనివారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మాంజీరా రోడ్డులో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, రమణ, యాదగిరి, ప్రశాంత్, హనీఫ్, బాబుమోహన్ మల్లేశ్ పాల్గొన్నారు.